ప్రపంచమే భయపడుతుంటే.. అతడు కరోనాని కావాలని తెచ్చుకున్నాడు.. ఎందుకంటే?

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 12:43 PM IST
ప్రపంచమే భయపడుతుంటే.. అతడు కరోనాని కావాలని తెచ్చుకున్నాడు.. ఎందుకంటే?

ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు వణికిపోతుంటే.. ఓ వ్యక్తి మాత్రం కరోనాను కౌగలించుకున్నాడు.. కావాలనే కరోనా వ్యాధిని అంటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫన్ వాన్ డాసెల్ ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే తాను ఇలా చేయడానికి బలమైన కారణం ఉందని మాత్రం స్టీఫెన్‌ చెబుతున్నాడు.

తన పార్ట్‌నర్‌ నుంచి కరోనా వైరస్‌ సోకేలా చేసుకున్నట్లు చెబుతున్న స్టీఫెన్‌.. కరోనాను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పని చేసినట్లు చెప్పాడు. అయితే తాను అనుకున్నదానికంటే ఈ వ్యాధి చాలా భయంకరం అయినది అని అతను చెప్పాడు. అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కరోనా కారణంగా అనారోగ్యం పాలైనట్లు చెప్పాడు. 

రోగనిరోధక శక్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో నేను వ్యాధి బారిన పడ్డానని, నేను మూడు రోజులు కొంచెం అనారోగ్యంతో ఉంటానని అనుకున్నానని, తరువాత నేను రోగనిరోధక శక్తిని పొందుతాను అని భావించినా అనుకున్న దానికంటే అది ప్రమాదం అని మాత్రం అర్థం అయినట్లు చెప్పారు. 53 ఏళ్ల స్టీఫెన్ ఇలా చెయ్యడంపై విభిన్న వాధనలు వినిపిస్తున్నాయి. అతనిని విమర్శిస్తున్నారు. 

స్టీఫెన్‌ చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మిగతావారికి కూడా కరోనా సోకితే ఏం చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే స్టీఫెన్‌ మాత్రం తను ప్రపంచం కోసమే ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన పార్ట్‌నర్‌కు కరోనా సోకడంతో.. నేను కూడా క్వారంటైన్‌లో ఉన్నానని, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా ఒకరి నుంచి మరోకరికి సోకుండా నిలువరించలేమని అతను చెప్పాడు.