రష్యాలో మిన్నంటిన ఆందోళనలు..ప్రతిపక్ష నేత భార్య అరెస్ట్

రష్యాలో మిన్నంటిన ఆందోళనలు..ప్రతిపక్ష నేత భార్య అరెస్ట్

Russian opposition leader జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశంలో ఆదివారం ఆందోళలు తీవ్రతరమయ్యాయి. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. వెయ్యి మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాస్కో లో..అలెక్సీ నావల్సీ భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసు ప్రధాన కార్యాలయానికి నిలయమైన మాస్కోలోని లుబియాంకా స్కేర్లో ఆదివారం నిరసనకు నావాల్నీ బృందం మొదట పిలుపునిచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో స్కేర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో నిరసన ఒక మైలు దూరంలో ఉన్న మరొక సెంట్రల్‌ స్కేర్‌కు మారింది. అక్కడికి చేరుకున్న వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.

నావల్నీ అరెస్టు వెనుక పెద్ద క‌థే ఉంది.

యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌ను స్థాపించి ర‌ష్యాలో అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మాన్ని న‌వాల్నీ నిర్వ‌హిస్తుండేవాడు. మ‌రో రెండు ప‌ర్యాయాలు అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు కొద్ది నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో భారీ కుట్ర జ‌రిగిన‌ట్లు న‌వాల్నీ ఆరోపిస్తున్నారు. అయితే యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌ను స్థాపించి పోరాడుతోన్న‌ అలెక్సీ నావల్నీపై ర‌ష్యా ప్ర‌భుత్వం నిధుల దుర్వినియోగం ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో సైబీరియాలోని టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నావల్నీ టీ తాగుతూ ఒక్కసారిగా విమానంలో కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఆ తర్వాత జర్మనీలోని ఓ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం అతనిని తరలించారు. విమానంలో అలెక్సీ నవాల్నీపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తాగిన టీలో విషం కలిసిందని..ప్రభుత్వమే ఇదంతా చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. రష్యా ప్రభుత్వమే తనను హత్యచేసేందుకు యత్నించినట్లుగా పేర్కొనగా అధికారులు ఆ ఆరోపణలను ఖండించారు.

కాగా, నావల్నీ శరీరంలో విషపు ఆనవాళ్లు కనిపించలేదని వైద్యులు అప్ప‌ట్లో ప్ర‌క‌ట‌న చేశారు. బెర్లిన్ నగరంలో ఓ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని ఆయ‌న పూర్తిగా కోలుకున్నప్ప‌టికీ ర‌ష్యాకు రాలేదు. ఆసుప‌త్రిలో కోలుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నరాలను ప్రభావితం చేసే విష ప్రయోగం త‌న‌పై జ‌రిగింద‌ని చెప్పారు. రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించారు. అయితే, ఆయ‌న ర‌ష్యాకు వ‌స్తే అరెస్టు చేస్తామ‌ని ఇటీవ‌లే ర‌ష్యా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ర‌ష్యా వ‌చ్చారు.

ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల పాటు కోమాలో ఉండి..కోలుకుని జనవరి 17న జర్మనీ నుండి రష్యాకి తిరిగి వచ్చిన నవాల్నీని పుతిన్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. జ‌ర్మ‌నీ రాజ‌ధాని బెర్లిన్ నుంచి మాస్కోలోని షెరెమెటివో విమానాశ్రయంలో ఆయ‌న అడుగు పెట్ట‌గానే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయనను అరెస్ట్ చేసినప్పటినుంచి రష్యా అట్టుడుకుతోంది. ఆయనను విడుదల చేయాలంటూ వరుసగా రెండు వారాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లమీదకి వస్తున్నారు. పుతిన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.