China : ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తుందా?

ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం లేదు. ప్రపంచమంతా వ్యతిరేకించే వారిని ఆ దేశం దగ్గరకు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా అమెరికాకు ఎవరు శత్రువులైతే వారిని మిత్రులుగా మార్చుకుంటోంది.

10TV Telugu News

China dominance : ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం లేదు. ప్రపంచమంతా వ్యతిరేకించే వారిని ఆ దేశం దగ్గరకు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా అమెరికాకు ఎవరు శత్రువులైతే వారిని మిత్రులుగా మార్చుకుంటోంది. నార్త్‌ కొరియా మొదలుకుని ఇప్పుడు తాలిబన్ల వరకు అంతటా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆసియాలో చిన్న దేశాలను తన గుప్పిట్లో పెట్టకుని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలని డ్రాగన్‌ కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తోంది. కానీ ఓ విషయం మాత్రం చైనా మర్చిపోతోంది. పాముకు పాలుపోసినా విషమే కక్కుతుంది. అమెరికా అనుభవం అదే చెబుతోంది. రేపు చైనాకు అదే జరగనుంది.

ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం అమెరికా – చైనా దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో కొన్ని దేశాలు బలిపశువులుగా మారుతున్నాయి. అందులో అఫ్ఘానిస్తాన్‌ ఒకటి. గతంలో అఫ్ఘాన్‌ను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వంతో కలిసి అమెరికా తాలిబన్లపై పోరాడింది. ఇప్పుడు చైనా అదే తాలిబన్లతో చేతులు కలిపి అమెరికాకు షాకిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏదో టామ్‌ అండ్‌ జెర్రీ గేమ్‌లా అనిపిస్తుంది. కానీ అక్కడి రక్తపాతానికి తాలిబన్లు ఎంత బాధ్యత వహించాలో… ఈ దేశాలు కూడా అంతే బాధ్యత వహించాలి. తాలిబన్ల మారణహోమంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇతర దేశాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బలగాలకు – తాలిబన్లకు మధ్య జరిగే పోరులో ఎంతో మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఈ పరిణామాలతో కాబూల్‌ లోని పాస్‌పోర్ట్‌ కార్యాలయం కిటకిటలాడుతోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ అటు ఇటుగా 2వేల మంది వరకు వస్తారు. కానీ ఇప్పుడు నిత్యం 10వేల మంది ప్రజలు పాస్ట్‌పోర్ట్‌ ఆఫీస్‌ ముందు క్యూలో నిలబడుతున్నారు.

మనిషికి గుండె ఎలాగో ఆసియాకు అఫ్ఘానిస్తాన్ అంత ముఖ్యమైనది. ఈ దేశంపై చైనా కన్ను ఎప్పటి నుంచో ఉంది. కానీ గత 20 ఏళ్లగా ఆ దేశంలో అమెరికా నాటో దళాలు ఉండడం నిత్యం ఘర్షణలతో విపత్కర పరిస్థితులు నెలకొనడంతో చైనా కామ్‌గా ఉండిపోయింది. ఇప్పుడు సరైన అవకాశం దొరకడంతో తాలిబన్లతో చేయి కలిపింది. అలాగే చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌ తన వ్యాపార వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. వఖాన్ కారిడార్‌లో చైనా ఈ రహదారిని నిర్మిస్తోంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, రష్యా మధ్య జరిగిన గ్రేట్ గేమ్‌లో వఖాన్‌ ప్రాంతానిది చాలా కీలక పాత్ర.

రష్యా, బ్రిటన్ మధ్య ఆసియా యుద్ధం జరుగుతున్నప్పుడు అఫ్ఘానిస్తాన్ చాలా ముఖ్య ప్రాంతంగా ఉండేది. ప్రత్యర్థి దేశాల సరిహద్దులు ఒకదానితో ఒకటి కలవకుండా వఖాన్ ప్రస్తుత సరిహద్దులను అప్పట్లో ఒక బఫర్ జోన్‌లా ఉయోగించారు. ఐతే కొంత కాలం వరకు ఇష్కాషిమ్ నుంచి ఉండే మట్టి రోడ్డు కారిడార్ మధ్యలో ఉన్న బ్రొగెల్ సరిహద్దు వరకే ఉండేది. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ నిర్మించడం వల్ల ఈ దారిని 75 కిలోమీటర్లు బొజయీ గంబాజ్ గ్రామం వరకూ వచ్చేలా పొడిగించారు. ఈ మార్గం పూర్తయితే మధ్య ఆసియా మార్కెట్లను చేరుకోవడం చైనాకు సులుభం అవుతుంది.

అఫ్ఘాన్‌లో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు కాపాడుకోవాలంటే కచ్చితంగా కొంత సపోర్ట్‌ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లే తమకు కరెక్ట్‌ ఆప్షన్‌ అని చైనా భావిస్తోంది. అందుకే వారితో చేయి కలిపింది. అందులోనూ తాలిబన్లకు అమెరికా కూడా శత్రువే కావడంతో… ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చైనా ప్లాన్‌ కన్పిస్తోంది. ఐతే అమెరికా గత అనుభవాలు చైనా మర్చిపోయిందా అన్న సందేహం కలుగుతోంది అసలు తాలిబన్లను పెంచి పోషించింది అమెరికానే… కానీ చివరకు అమెరికా కంట్లోనే తాలిబన్లు పొడిచారు. ఇప్పుడు చైనా విషయంలోనూ అదే జరిగేటట్లు కన్పిస్తోంది. తాలిబన్లను నమ్ముతూ పోతే కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు గట్టి షాకివ్వడం మాత్రం పక్కా అనిపిస్తోంది.

ప్రపంచం దూరం పెట్టిన దేశాలు, ప్రమాదకర సంస్థలను చైనా దగ్గర చేసుకోవడంపై అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగా ఉత్తరకొరియాకు అన్నీ దేశాలు దూరంగా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకర అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఆదేశాన్ని అంతా పక్కన పెట్టేశారు. అలాంటి దేశంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను చైనా కొనసాగిస్తోంది. గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అప్పట్లో నార్త్‌ కొరియా చీఫ్‌ను కలిసిన తర్వాత ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం తొలగిపోయి బంధం బలపడుతుందని ఆశించినా అలాంటిదేం జరగలేదు.

ఇప్పటికీ ఆ రెండు దేశాలు అంటీముట్టనట్లుగానే ఉంటున్నాయి. అలాంటి దేశంతో చైనా క్లోజ్‌గా ఉంటోంది. ఇప్పుడు తాలిబన్ల విషయంలోనూ అదే చేస్తోంది. ప్రపంచంలో మెజార్టీ దేశాలు వ్యతిరేకించిన వారిని చైనా చేరదీస్తోంది. అమెరికా లేదంటే మెజార్టీ దేశాలు చెప్పింది మేం వినాలా ? అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇలానే చైనా తీరు కొనసాగితే… ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న కోల్డ్‌వార్‌ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.

10TV Telugu News