ఇది నిజమే: 9వ ఫ్లోర్ నుంచి పడి నడుచుకుంటూ వెళ్లిపోయిన మహిళ

ఇది నిజమే: 9వ ఫ్లోర్ నుంచి పడి నడుచుకుంటూ వెళ్లిపోయిన మహిళ

ఓ మహిళ బిల్డింగ్ 9వ ఫ్లోర్ నుంచి పడి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన సంగతి గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేయాలంటూ హడావుడి మొదలుపెట్టారు స్థానికులు. అంతే పడిన కొద్ది సెకన్ల తర్వాత లేచి కూర్చొంది. ఆ తర్వాత మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటన రష్యాలోని ఇజ్లూచిన్క్‌లో జనవరి 22న జరిగింది. 

ఈ అద్భుతమైన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తొమ్మిదో ఫ్లోర్ నుంచి ఆమె కిందకు మూడు సెకన్ల వ్యవధిలో పడిపోయింది. ఆమె పడినప్రాంతంలో పెద్ద ఎత్తులో మంచు ఉంది. పడిన వెంటనే మంచులో కూరుకుపోయి కుషన్‌లా సపోర్ట్ ఇచ్చింది. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంత ఎత్తునుంచి పడగానే మహిళ కదలకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని భావించారు. 

కొద్ది సెకన్ల తర్వాత పడిన ప్రదేశం నుంచి లేవడం గమనించారు. ఆ తర్వాత ఆమే స్వయంగా వాకింగ్ చేసుకుంటూ వెళిపోతూ కనిపించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆమె కాస్త దూరం వెళ్లాక అంబులెన్స్ పిలవమని స్థానికులకు చెప్పింది. ప్రస్తుతం సిబేరియాలోని హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. 

అంత ఎత్తునుంచి పడడంతో పైకి కనిపించే గాయాల కంటే అంతర్గతంగా శరీర భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని వైద్యులు తెలిపారు. కానీ, ఎముకలకు ఎటువంటి సమస్య లేదు. మహిళ పైనుంచి పడిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు.. దూకిందా.. ఎవరైనా తోసేశారా.. జారిపడిందా అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారణమేదైనా మహిళ సేఫ్ అవడానికి ఆశ్చర్యపడుతూ తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.