కరోనా భయంతో ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మహిళలు

కరోనా భయంతో ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మహిళలు

కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చేశారు. కరోనా వచ్చాక చాలానే మార్పులు వచ్చాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా ప్రభావం ఎంతగా ఉందంటే, మహిళలు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పిల్లలను కనేందుకు ఎవరూ ఇష్ట పడటం లేదు. మరికొన్నాళ్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు.

ప్రతీ మహిళకు మాతృత్వం ఓ వరం:

ప్రతీ మహిళకు మాతృత్వం ఓ వరం. వివాహమైనప్పట్నుంచీ అమ్మ అని పిలిపించుకునేందుకు ఆరాట పడుతుంది. గర్భం దాల్చాను అన్న విషయం తెలియగానే ఆమె ఆనందానకి అవధులు ఉండవు. ఎప్పుడెప్పుడు తన బిడ్డ భూమి పడుతుందా అని ఎదురుచూస్తుంది. కానీ, కరోనా కారణంగా మహిళలు త్యాగాలకు సిద్ధమవుతున్నారు. గర్భదారణను డిలే చేస్తున్నారు.

 

ఈ సంక్షోభ పరిస్థితుల్లో పిల్లలు వద్దనుకుంటున్నారు:

అమెరికాలో ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 34శాతం మంది మహిళలు గర్భదారణ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడే పిల్లలను కనడం ఇష్టం లేదని చెప్పారు. సుమారు 2వేల మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో బ్లాక్, లాటినా మహిళలు ఎక్కువమంది ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకోవడానికి మొగ్గు చూపారు. తెలుపు మహిళల్లో 29శాతం మంది, బ్లాక్ ఉమెన్ లో 38శాతం మంది, ల్యాటినా ఉమెన్ లో 45శాతం మంది ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఖర్చులు, కరోనా భయాలు:

ఇప్పుడే పిల్లలను వద్దనుకోవడానికి అనే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఖర్చు. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఉపాధి లేదు, ఆదాయం లేదు. ఇల్లు గడవటమే కష్టంగా మారింది. అంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలీదు. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం ఊడితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. దీనికి తోడు ఆసుపత్రి ఖర్చులు, రవాణ ఖర్చులు, పిల్లల సంరక్షణ, ఇంటిని వదిలి బయటకు వెళ్లడం… ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. ఈ కారణాల వల్ల పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపారు.

 

కోటికి చేరువలో కరోనా కేసులు:

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న(జూన్ 26,2020) ఒక్కరోజే అమెరికా, బ్రెజిల్‌లో కలిపి 92వేల 163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా కేసులు 25.5 లక్షలు దాటగా, బ్రెజిల్‌ లో 13 లక్షల దిశగా పరుగులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం(జూన్ 26,2020) ఒక్కరోజే లక్షా 93వేల 781 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99లక్షల 3వేల 986కి చేరింది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 4లక్షల 96వేల 845 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 5వేల 62 మంది మృతిచెందారు. కరోనా బారినపడిన వారిలో 53లక్షల 57వేల 233 మంది కోలుకోగా, 40లక్షల 49వేల 908 మంది చికిత్స పొందుతున్నారు. క్లోజింగ్‌ కేసుల్లో 92 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటే, 8 శాతం మంది బాధితులు చనిపోతున్నారు.

 

అమెరికాలో అల్లకల్లోలం:

అమెరికాలో కరోనా ఉధృతి మరింత పెరిగింది. తాజాగా దేశంలో 45వేల 256 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25లక్షల 52వేల 956కు చేరింది. ఈ వైరస్‌తో నిన్న 600 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 27వేల 640కి పెరిగింది. దేశంలో 10లక్షల 68వేల 703 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 13లక్షల 56వేల 613 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

 

ఇక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12లక్షల 80వేల 54. ఇప్పటివరకు 56వేల 109 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే దేశంలో కొత్తగా 46,907 కేసులు నమోదవగా, 1055 మంది మరణించారు. రష్యాలో నిన్న కొత్తగా 6800 కరోనా కేసులు రాగా, కొత్తగా 176 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,20,794కు చేరగా, 8,781 మంది చనిపోయారు.

 

భారత్ లో 5లక్షలు దాటిన కరోనా కేసులు:

భారత్‌లో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవడుతున్నాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 5లక్షల 9వేల 446 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో 15వేల 689 మంది మరణించారు. రోజువారీ కొత్త కేసులుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా, మొత్తంగా కేసులు, మరణాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

Read: దశాబ్దకాలపు సూర్యుడు.. అద్భుతమైన వీడియో.. విడుదల చేసిన నాసా