ఇళ్ల నుంచే పనిచేయండి …కొత్త ఆంక్షలతో బ్రిటన్ లో మళ్ళీ లాక్ డౌన్

  • Published By: venkaiahnaidu ,Published On : September 22, 2020 / 03:27 PM IST
ఇళ్ల నుంచే పనిచేయండి …కొత్త ఆంక్షలతో బ్రిటన్ లో మళ్ళీ లాక్ డౌన్

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూతన ఆంక్షలను విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పలు ముఖ్యమైన నిబంధనలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం.. ఇంగ్లాండ్​లోని ఉత్తర ప్రాంతాల్లో కఠినమైన లాక్​డౌన్​ అమలవుతోంది. మంగళవారం నుంచి ఇతర ప్రాంతాలు కూడా లాక్​డౌన్​లోకి రానున్నాయి. బాధితులు, మరణాల సంఖ్యను తగ్గించేందుకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.


దీంతో పాటు ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఉన్న బార్లు, పబ్స్​, రెస్టారెంట్లను రాత్రి 10గంటలకే మూసివేయాలని ఆదేశాలిచ్చినట్లు కేబినెట్ ఆఫీస్ మంత్రి మైకేల్ గోవ్ తెలిపారు. ఇంటి నుండి పని(వర్క్ ఫ్రమ్ హోం) చేయగల వ్యక్తులు దాన్ని కంటిన్యూ చేయమని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి “సోషల్ మిక్సింగ్” ను తగ్గించడం ముఖ్యమని గోవ్ చెప్పారు. ఆంక్షలు ఎంతకాలం అమల్లో ఉంటాయో చెప్పడం అసాధ్యమని ఆయన అన్నారు.

అంతేకాకుండా, బ్రిటన్ ​లో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళనకరంగా మారడంతో… కరోనా విజృంభణకు చిహ్నంగా వైరస్​​ అలర్ట్​ వ్యవస్థను మూడు నుంచి నాలుగుకు పెంచింది బోరిస్ ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉందని దీని అర్థం.


పెరుగుతున్న కేసులపై ఇంగ్లాండ్​, స్కాట్​ల్యాండ్​​, ఉత్తర ఐర్లాండ్​, వేల్స్​ ప్రాంతాలకు చెందిన సీఎమ్​ఓలు(చీఫ్​ మెడికల్​ ఆఫీసర్స్​) ఓ ప్రకటనను విడుదల చేశారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు కొంతకాలం తగ్గిన అనంతరం.. మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వైరస్​ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే అలర్ట్​ లెవల్​ను 3 నుంచి నాలుగుకు పెంచమని సంయుక్త బయో సెక్యూరిటీ సెంటర్​ సిఫార్సు చేసింది. నేషనల్​ హెల్త్​ సర్వీస్​ కు బాధితుల తాకిడితో పాటు భారీ స్థాయిలో మృతుల సంఖ్యను నివారించాలంటే.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలి. మాస్కులు ధరించాలి. ఇది ప్రజలకు ఆందోళనకరమైన వార్తే అయినప్పటికీ.. నిబంధనలను పాటించాల్సిందే అని తెలిపారు.



మరోవైపు, అక్టోబర్ చివరి నాటికి బ్రిటన్ లో రోజుకు 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని అక్కడి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కాగా, బ్రిటన్​ లో ప్రస్తుతం 3,98,625 కేసులున్నాయి. కరోనా ధాటికి ఇప్పటివరకు 41,788మంది ప్రాణాలు కోల్పోయారు.