Breastfeeding Week : త‌ల్లి పాల‌కు..పోత పాలకు తేడాలు..బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి?

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా..తల్లి పాలకు ఇతర పాలకు తేడాలు ఏంటీ.అసలు తల్లి బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి? తల్లిపాలు బిడ్డల ఎదుగుదలకు ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి.ఇతర పాలవల్ల కలిగే నష్టాలేంటి అనే అనేక విషయాలు తెలుసుకుందాం.

10TV Telugu News

World Breastfeeding Week 2021 : తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. తల్లిపాల విలువను తెలియజేస్తూ తల్లి బిడ్డలకు పాలు ఇస్తే తల్లికి ఎంత మేలు..బిడ్డ ఆరోగ్యానికి ఎంత ఉపయోగం వంటి అవగహనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో తల్లి పాలకు ఇతర పాలకు తేడాలు ఏంటీ.అసలు తల్లి బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి? అని తెలుసుకుందాం.

తల్లి బిడ్డకు పాలు ఇస్తూ బిడ్డ వంక మాతృత్వపు మమకారం నిండిన కళ్లతో ప్రేమగా..ఆప్యాయంగా ఆదరంగా చూస్తుంది. తల్లి రొమ్ము స్పర్శతో బిడ్డకు అమ్మంటే ఏంటో తెలుస్తుంది. బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారం. అందుకే బిడ్డ పుట్టిన నాటి నుంచి 6 నెలల వరకు..అవసరాన్ని బట్టి ఏడాది వరకు తల్లిపాలే తాగించాలని నిపులు పదే పదే చెబుతుంటాయి. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండడం వల్ల బిడ్డ శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

తల్లి ముర్రుపాలతో బిడ్డకు ఎన్ని ప్రయోజనాలో..
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో మొదటగా ఊరేవి ముర్రుపాలు. వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలి. ఎట్టిపరిస్థితుల్లోను వాటిని బిడ్డకు పట్టించాల్సిందే. కొంతమంది ముర్రుపాలు బిడ్డకు అరగవని పిండి పారబోసేస్తారు. అలా అస్సలు చేయకూడదు. ముర్రుపాలలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుంది. ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటే ఆ పాలు ఎంత ఉపయోగమో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పసికందులో జ్ఞాపకశక్తి పెంచే శక్తి ముర్రుపాలల్లో ఉంది. మెదడు చురుకుగా పనిచేయటానికి ఇవి దోహదపడతాయి. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలి. పాలిచ్చే తల్లి నీరు ఎక్కువగా తాగాలి. దీని వల్ల తల్లికి పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో తల్లి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి.

తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలకు..పోతపాలు తాగి పెరిగిన పిల్లలకు ఆరోగ్యం విషయంలో చాలా తేడా ఉంటుంది. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు అనారోగ్యాల బారిని పడటం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇతర పాలు అంటే పోతపాలు తాగి పెరిగిన పిల్లలు అనారోగ్యానికి చాలా త్వరగా లోనవుతారనే విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఇతర పాలు తాగిన పెరిగినవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటటంతో తరచు అనారోగ్యాలకుగురవుతుంటారు. అదే తల్లిపాల్లో ఉండే పోషకాలతో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు.అలాగే రోగాలబారిని పడకుండా తల్లిపాలల్లో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.

తల్లిపాలు తాగటం వల్ల పిల్లలు శ్వాస సంబంధిత వ్యాధులు, చెవిలో ఇన్‌ఫెక్షన్‌,అస్తమా, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు(యూరీనరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌) రాకుండా తల్లిపాలు కాపాడతాయి. చిన్నపేగు, పెద్ద పేగుల సంబంధిత వ్యాధులు (గ్యాస్ట్రో నింటెస్టినల్‌ రిఫ్లెక్స్‌), మెదడుపై పొరల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు, కీళ్ల సంబంధిత వ్యాధులు,తెల్లరక్త కణాల సంబంధిత వ్యాధులు,(చైల్డ్‌హుడ్‌ లింపోమస్‌) రాకుండా తల్లిపాలు పిల్లలను సంరక్షిస్తాయి. అలాగే తల్లిపాలు తాగిన పిల్లలు డయాబెటిస్‌, ఊబకాయం, గుండె జబ్బులు వంటివి దరిచేరవు. గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తల్లిపాలు బిడ్డలకే కాదు బిడ్డలకు పాలిచ్చిన తల్లులకు కూడా చాలా ఉపయోగాలున్నాయి. బిడ్డలకు పాలు ఇస్తే వారికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

తల్లి పాలల్లో అనేకమైన పోషకాలుంటే..ఆవు పాలలో కేసిన్‌ అనే ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. తల్లిపాలల్లో ఉండే పోషకాలు, ప్రొటీన్లు బిడ్డలకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ రాకుండా కాపాడతాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అదే ఆవుపాలల్లో ఉండే కేసిన్‌ అనే ప్రొటీన్‌ పిల్లల కడుపులోకి వెళ్లాక ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీంతో జీర్ణమవడం కష్టంగా మారుతుంది. అదే తల్లిపాలలో ఈ బిడ్డకు ప్రొటీన్‌ తగినంత పరిమాణంలో ఉండడం వల్ల శిశువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా జీర్ణమవుతాయి. తల్లిపాలలో లాక్టోజ్‌ పరిమాణం(ఎల్‌/7జీ) ఉండగా ఆవు పాలలో (ఎల్‌/48జీ)గా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరులో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే లాక్టోజ్‌ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల తల్లిపాలు తాగే శిశువులు ఆరోగ్యంతోపాటు చురుగ్గా ఉంటారు. తల్లిపాలలో ఉండే లినోయిన్‌ ఆమ్లం శిశువు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. తల్లి పాలలో ఐరన్‌ 50 శాతం ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ. ఏ రకంగా చూసినా బిడ్డకు తల్లిపాలు పట్టడం తల్లీబిడ్డకు చాలా చాలా ఉపయోగం.

డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో..తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందనే విషయం తెలిసిందే. ఇది ప్రతీ ఏటా కొనసాగుతుంది. భారత్ లో బీపీఎన్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌) ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంటారు.

బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి పాటించాల్సిన పద్ధతులు..
బిడ్డక పాలు ఇచ్చే ప్రతీసారి తల్లి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆతరువాతే బిడ్డకు పాలివ్వాలి.
అలా తల్లి పడుకుని గానీ..వంగి పాలివ్వకూడదు.అంతేకాదు పాలిచ్చిన ప్రతిసారి రెండు వైపులా పట్టించాలి. అంటే రెండు రొమ్ముల పాలు పట్టించాలి.

బిడ్డ కడుపు నిండా పాలు తాగిన తరువాత..బిడ్డ పాలు తాగడం పూర్తయిన తర్వాత పెదాలను శుభ్రపరచాలి. తరువాత బిడ్డను భుజాన వేసుకోవాలి.

బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలే ఇవ్వాలి. ఆ తరువాత నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లో మెత్తని ఆహారాన్ని బిడ్డకు పెట్టాలి. బిడ్డ బరువు సరైన వయస్సుకు సరైన బరువు ఉన్నాడా లేదా..పెరుగుదల ఎలా ఉంది? హాయిగానిద్రపోతున్నాడా లేదా? అలాగే మూత్రం పోయడం సవ్యంగా ఉందా లేదా?వంటివన్నీ గమనించాలి. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో కూడా ఎప్పుటికప్పుడు తెలుసుకోవాలి. బిడ్డకు పాలు సరిపోకపోతే ఏడ్వటం..సరిగానిద్రపోకపోవటం..లేదా నీరసంగా ఉండటం..ఉత్సాహంగా లేకపోవటం వంటి లక్షణాలుగా గుర్తించాలి. బిడ్డకు మొదటి సంవత్సరం తల్లి ఇచ్చే పాలు శక్తిని ఇస్తాయి. అవి బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. తల్లిపాలు బిడ్డలో చిన్నతనం నుంచే రోగనిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది.

డబ్బాపాలతో బిడ్డలకు ఇన్‌ఫెక్షన్‌
తల్లిపాలు తాగని నవజాత శిశువులకు డయేరియా వ్యాధిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బాటిల్‌ ఫీడింగ్‌ వల్ల కంటా మినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఆవు పాలల్లో అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మెదడు చురుకుగా ఉండదు.పిల్లలు ఉండాల్సిన బరువు కంటే అత్యధిక బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. బరువు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. కాగా..బిడ్డలకు తేనె, గ్లూకోజు వంటివి ఇస్తుంటా పెద్దవాళ్లు.కానీ అటువంటివి ఇవ్వకూడదని..కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు. తల్లిపాలు ఇవ్వటం తల్లికి రక్ష బిడ్డకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిపాలే బిడ్డలకు ఇవ్వండీ..

కానీ.. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా, పౌడర్‌ పాలను అలవాటు చేస్తున్నారు. ఇది శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే విషయం తెలుసుకోవాలి. శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన అవసరం..కలిగే ప్రయోజనాల గురించి ప్రతీ ఒక్కరు అవగాహనం పెంచుకోవాలనే ఈ ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ముఖ్య ఉద్ధేశం.