WHO Chief : అలా చేస్తే కొన్ని నెలల్లోనే కరోనాని అదుపులోకి తేవచ్చు

వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్​ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.

WHO Chief : అలా చేస్తే  కొన్ని నెలల్లోనే కరోనాని అదుపులోకి తేవచ్చు

Who Chief

World Health Organization వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్​ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రపంచ దేశాలు నిష్పక్షపాతంగా వినియోగించుకోవడం ఎంతో అవసరమని తెలిపింది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటైన పత్రికా సమావేశంలో కరోనా సంక్షోభం కట్టడిపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ మీడియా సమావేశంలో గ్రెటా థన్‌బర్గ్‌ అతిథి‌గా హాజరయ్యారు.

కొంతకాలంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో పెరగడంపైఈ సందర్భంగా WHO చీఫ్ టెడ్రోస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిపై ప్రపంచ దేశాలు కలిసిపోరాడాలన్నారు. ప్రస్తుతం 25 నుంచి 59ఏళ్ల మధ్య వయసు వారిలోనూ వైరస్ వ్యాప్తి చెందుతోందని.. ఇందుకు తీవ్రత ఎక్కువగా ఉన్న కొత్తరకాలే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయానికి 10లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి 7నెలల సమయం పడితే, మరో నాలుగు నెలల్లోనే ఆసంఖ్య 20లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో మూడు నెలల్లోనే కరోనా మరణాల సంఖ్య 30లక్షలకు చేరడం ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ నేషనలైజేషన్‌ను అనుసరించడంపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్‌ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం టీకా పంపిణీని జాతీయవాదమే నడిపిస్తోంది. కరోనా కారణంగా అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్న వారికే ముందుగా టీకా అందాలి. వారు ధనిక దేశంలో ఉన్నారా పేద దేశంలో ఉన్నారా అనే అంశం దీన్ని ప్రభావితం చేయకూడదు. నైతికంగా ఇదే సరైన చర్య అని గ్రెటా థన్‌బెర్గ్‌ వ్యాఖ్యానించారు. ధనిక ఆదాయ దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు వ్యాక్సిన్‌ తీసుకుంటుండగా, పేద దేశాల్లో మాత్రం ప్రతి 500మందికి ఒకరు మాత్రమే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.