లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్న దేశాలు, మళ్లీ జనసందోహాలు, WHO ఆందోళన

యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 02:29 AM IST
లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్న దేశాలు, మళ్లీ జనసందోహాలు, WHO ఆందోళన

యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్

యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్ అమలు చేశాయి కూడా. కొన్ని దేశాలు కొన్ని వారాలు, నెలల పాటు లాక్ డౌన్ విధించాయి. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు సోమవారం(ఏప్రిల్ 20,2020) లాక్ డౌన్ నిబంధనలను సడలించాయి. దీంతో జనసందోహం మొదలైంది. డెన్మార్క్ లోని టాటూ పార్లర్లు, ఆస్ట్రేలియాలోని బీచ్ లు, జర్మనీలోని బుక్ స్టోర్స్ తెరచుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో అతిపెద్ద సీరియల్ నైబర్స్ షూటింగ్ పునఃప్రారంభించనున్నారు. జర్మనీ, స్వీడన్, స్లొవేకియాల్లో కార్ల ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కానుంది. డెన్మార్క్ లోనూ క్రమేపీ వ్యాపార కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇరాన్ లో జాతీయ రహదారుల్ని, వ్యాపార కేంద్రాలను తెరవడం ప్రారంభమయింది. 

ఇటలీలో లాక్ డౌన్ ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు:
ఇటలీలో మరణాలు ఎక్కువగా కనిపించిన దృష్ట్యా లాక్ డౌన్ ను ఎత్తివేయాలా, కొనసాగించాలా అనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంక్షల్ని సడలించే అవకాశాలు లేవని బ్రిటన్ చెబుతోంది. అనేక ఇతర దేశాలూ సడలింపుల దిశగానే వెళ్తున్నా, కొత్త కేసులు పెరగకుండా సామాజిక దూరాన్ని తగినంత పాటించాలని భావిస్తున్నాయి.

లాక్ డౌన్ కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు:
ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 24.53 లక్షల మంది కరోనా బారిన పడగా వారిలో 1.65 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 41 వేల మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు ఈ దేశంలో 7లక్షల 71వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇళ్లకే పరిమితం కావాలన్న ఆంక్షల్ని వ్యతిరేకిస్తున్నవారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధిని కోల్పోతున్నామంటూ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రదర్శనల కారణంగా కొన్ని రాష్ట్రాలు, ప్రధానంగా రిపబ్లికన్ నేతల పాలనలో ఉన్నవి ఆంక్షల్ని సడలించే దిశగా వెళ్తున్నాయి. 

వెంటనే ఆంక్షలను సడలించడం తొందరపాటే అవుతుందని వార్నింగ్:
అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచికి తక్షణం ఉద్వాసన పలకాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా వారెవరూ మాస్కులు ధరించడం లేదు, వ్యక్తిగత దూరం పాటించడం లేదు. ఆంక్షల ఎత్తివేతలో తొందరపడితే మొదటికే మోసం వస్తుందని ఫౌచి హెచ్చరిస్తున్నారు. క్రమేపీ సాధారణ పరిస్థితులకు చేరుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన రాష్ట్రాలను కోరారు. దానికి తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో కిట్లు లేనందున వాటిని ముందు సరఫరా చేయాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. వెంటనే ఆంక్షలను సడలించడం తొందరపాటే అవుతుందని, మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని రాష్ట్రాల గవర్నర్లు హెచ్చరిస్తున్నారు.

న్యూజెర్సీలో మృతదేహాల కలకలం:
మరోవైపు న్యూజెర్సీలోని ఒక నర్సింగ్ హోంలో కవర్లలో చుట్టి ఉంచిన 70 మృతదేహాలు ఒకేసారి బయటపడడం కలకలం రేకెత్తించింది. న్యూజెర్సీతో పాటు కనెక్టికట్ లో కొత్తగా మరణాల సంఖ్య తగ్గడం ఉపశమనాన్ని కలిగించే విషయం. న్యూయార్క్ లో 3000 మందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం సోమవారం మొదలయింది. ఆ రాష్ట్రంలో ఆంక్షల ఎత్తివేతకు ఇంకా సమయం ఉందని గవర్నర్ చెప్పారు. న్యూయార్క్ లో సోమవారం మృతుల సంఖ్య 478కి తగ్గింది. మూడువారాల్లో ఇదే తక్కువ.

తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దన్న డబ్ల్యూహెచ్ వో:
ఏ దేశంలోనైనా లాక్ డౌన్ ఆంక్షల్ని సడలించడమంటే అక్కడ అంతటితో కరోనా అంతరించినట్లు కాదనీ, తదుపరి దశకు ప్రారంభంగా మాత్రమే దానిని చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. జి-20 దేశాల ఆరోగ్య మంత్రులతో ఆయన ఆన్ లైన్ లో మాట్లాడారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఆయా దేశాలకు గట్టిగా హెచ్చరించారు. వెను వెంటనే సాధారణ పరిస్థితికి రావాలనుకోవడం తగదనీ, చర్యలన్నీ దశలవారీగానే తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా కారణంగా యూరప్ సమాఖ్య మొత్తంమీద దాదాపు ఆరు కోట్ల మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటారని మెకిన్సే అంచనా వేసింది. కరోనాను అదుపు చేయలేకపోతే ఈయూలో నిరుద్యోగిత 6% నుంచి దాదాపు రెట్టింపు అవుతుందని పేర్కొంది. కాగా, యూరప్ లో కరోనా బారిన పడినవారి సంఖ్య 10 లక్షలు, మృతుల సంఖ్య ఒక లక్ష దాటింది. ఇక వైరస్ తీవ్రత తగ్గుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ప్రణాళికలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రకటించాయి.