కరోనాతో ప్రపంచానికి పొంచి ఉన్న మరో భారీ ముప్పు, UNO వార్నింగ్

  • Published By: naveen ,Published On : June 10, 2020 / 05:32 AM IST
కరోనాతో ప్రపంచానికి పొంచి ఉన్న మరో భారీ ముప్పు, UNO వార్నింగ్

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో తెలియదు. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. దీంతో యావత్ ప్రపంచం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలు ప్రాణాలను మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచానికి మరో భారీ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. అదే ఆహార సంక్షోభం. అవును, రానున్న రోజుల్లో తీవ్రమైన ఆహార సంక్షోభ పరిస్థితులు ఎదురవనున్నాయని యూఎన్ఓ చెబుతోంది. ప్రమాద ఘంటికలు మోగించింది.

ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం:
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ప్రపంచాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవ్వాలని, సంక్షోభ నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. లేదంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. కనీసం 50ఏళ్ల పాటు ఆహార సంక్షోభ పరిస్థితులు చూడాల్సి వస్తుందని యూఎన్ఓ వార్నింగ్ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు:
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ఓ తెలిపింది. వీరిలో 144 మిలియన్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ప్రస్తుతం 780 కోట్ల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని యూఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. కానీ, వాటిని క్షేత్ర స్థాయికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార కొరత లేదా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మరింత విస్తరించనుందని తెలిపారు. పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు కచ్చితంగా పౌష్టికాహారం అందేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. వ్యవసాయ, ఆహార సంబంధిత సేవల్ని అత్యవసర సేవల కింద గుర్తించాలన్నారు. తద్వారా ఆయా రంగాల్లో పనిచేసేవారికి రక్షణ కల్పించాలన్నారు. ఆహార శుద్ధి, రవాణ సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పేదలకు తక్షణమే మెరుగైన సామాజిక రక్షణలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పింది. 

లాక్ డౌన్ వల్ల కొత్త సమస్య:
తక్షణమే ప్రభుత్వాలు మేల్కొని రక్షణ చర్యలు చేపట్టకపోతే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎన్ఓ చెప్పింది. ఏమాత్రం మేల్కోకపోయినా దాని పరిణామాలు ప్రపంచంపై చాలా తీవ్రంగా ఉంటాయంది. లాక్ డౌన్ కారణంగా పెరిగిపోతున్న నిరుద్యోం, తగ్గిన ఆదాయం చాలామందికి ఆహారం అందుబాటులో లేకుండా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాన్ని లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించాయి. అయితే అదే అస్త్రం ఇప్పుడు మరో సమస్యకు దారితీసింది. లాక్ డౌన్ కారణంగా వ్యవసాయం చేయడం, ఆహారం కొనడం, అమ్మడం వంటి వాటిపై ప్రభావం పడింది. రానున్న రోజుల్లో ఎదురయ్యే ఆహార సంక్షోభం చాలా భిన్నమైనది, తీవ్రమైనది.. గతంలో ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నిపుణులు చెప్పారు. కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని యూఎన్ఓ చెబుతోంది.