మేము ఉన్నాం : శ్రీలంకకు పలు దేశాల అండ

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 09:51 AM IST
మేము ఉన్నాం : శ్రీలంకకు పలు దేశాల అండ

మేము ఉన్నాం..అంటూ శ్రీలంకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదులు జరిపిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అక్కడ జరిగిన మారణకాండపై పలు దేశాలు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశాయి. లంక దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయా దేశాధ్యక్షులు, ప్రధానులు ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు ఖండించి సానుభూతి తెలియచేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 

ఉగ్రవాదులు చేసిన దాడిని పిరికిపిందల చర్య అంటూ లంక ప్రధాన మంత్రి విక్రమ సింఘే అభివర్ణించారు. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్న ప్రజలు..ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కొలుకొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని ప్రకటించారు. 

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సింహళ భాషలో మోడీ ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో హింసకు తావు లేదని తెలిపిన ఆయన..గౌతమ బుద్ధుడి బాటను అనుసరిస్తున్న శ్రీలంకలో ఇంత పెద్ద ఎత్తున మారణ హోమం సాగించడం తగదన్నారు. 

శ్రీలంకలో జరిగిన దాడులు తమ దేశాన్ని కలిచివేశాయంది బ్రిటన్. ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోలేదని..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ దేశ ప్రజలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని శ్రీలంకలో బ్రిటన్  హై కమిషనర్ జేమ్స్ డౌరిస్ తెలిపారు. దేశం తరపున అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. 

లంకలో జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు పాక్ దేశం పేర్కొంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డా.మొహమ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల చర్యలను..వారు చేస్తున్న పనులను ఎవరూ సమర్థించరని వెల్లడించారు. లంక ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించారు.