క‌రోనా వ్యాక్సిన్ తయారీలో రష్యా ‌సూపర్ ఫాస్ట్…క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి

  • Published By: venkaiahnaidu ,Published On : July 12, 2020 / 08:09 PM IST
క‌రోనా వ్యాక్సిన్ తయారీలో రష్యా ‌సూపర్ ఫాస్ట్…క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి

గతేడాది చివర్లో తొలిసారిగా చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని నిర్మూలించ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. భార‌త్‌, అమెరికా, ర‌ష్యా, చైనా స‌హా ప‌లు దేశాలు క‌రోనాకు వ్యాక్సిన్‌ను త‌యారుచేసే ప‌నిలో బిజీగా ఉన్నాయి. ఈ మేర‌కు ఆయా దేశాల్లో ప‌రిశోధ‌న‌లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ సంస్థ, భారత్ లో భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. ఇవన్నీ జంతువులపై ప్రయోగాలు పూర్తిచేసి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అయితే, రష్యా పరిశోధకులు మాత్రం చాపకింద నీరులా ప్రయోగాలు చేపట్టి ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశారు.

ర‌ష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయ‌ని మాస్కోలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం పేర్కొన్న‌ది. వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రష్యాకు చెందిన గమలీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ టీకా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జూన్‌ 18న ప్రారంభమయ్యాయి. పరీక్షలు చేపట్టిన తొలి బృందం వలంటీర్లు బుధవారం డిశ్చార్జి అవుతారని, రెండో బృందం ఈ నెల 20న డిశ్చార్జి అవుతుందని సెచెనోవ్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ తెలిపారు.

వ్యాక్సిన్ సురక్షితమైనదా కాదా అనే విషయాన్ని పరీక్షించడమే ఈ క్లినికల్ ట్రయల్స్ ఉద్దేశం అని,వ్యాక్సిన్ భద్రత నిర్ధారణ అయిందని సెచెనోవ్ వర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటమాలజీ, ట్రాపికల్, వెక్ట్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ పేర్కొన్నారు. తదుపరి దశలో ఎలాంటి పరీక్షలు చేపట్టాలన్నది వ్యాక్సిన్ రూపకర్తలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఉత్పత్తి దిశగా దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలిపారు