రంగు మారిన వుహాన్ డాక్టర్ మృతి..చైనాపై WHO గుర్రు

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 04:06 AM IST
రంగు మారిన వుహాన్ డాక్టర్ మృతి..చైనాపై WHO గుర్రు

కరోనా కారణంగా చర్మం రంగు మారిన వుహాన్ డాక్టర్…  ఆ వైరస్‌కు బలయ్యాడు. నాలుగు నెలల పాటు వ్యాధితో పోరాడిన డాక్టర్ ప్రాణాలు విడిచాడు. అత్యధిక కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో ఆయన సేవలందించారు. 10 లక్షలకు మందికి పైగా నివసించే ఆ నగరంలో కొద్ది వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. దీంతో… కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న వుహాన్‌లో  జరిగిన ఈ ఘటనతో మరోసారి కరోనా మరణమృదంగం మోగినట్లయింది.

మరోవైపు కరోనా విషయంలో చైనాపై ట్రంప్‌ చేసిన ఆరోపణల్లో నిజముంది అంటోంది అమెరికాలోని ఓ వార్తా సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్గత డాక్యుమెంట్లు, ఈ-మెయిల్స్‌, ఇంటర్వ్యూలు తమ చేతికి చిక్కాయని, వాటి ఆధారంగా పలు సంచలన విషయా లు తెలిశాయంటూ అసోసియేటెడ్ ప్రెస్‌ ఒక నివేదిక ప్రచురించింది.  గత ఏడాది డిసెంబరులోనే వుహాన్‌లో పలువురు ఆస్పత్రుల్లో చేరారని… వారి నమూనాలను పరిశీలించాక డిసెంబర్ 27న కరోనా వైరస్ గురించి తెలిసిందని.. ఈ ఏడాది జనవరి 2కల్లా వైరస్‌ జన్యువును కూడా డీకోడ్‌ చేశారని  పేర్కొంది. కానీ ప్రపంచంతో పంచుకోవడంలో మాత్రం చైనా తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపించిందని ఆరోపించింది.

కరోనా విషయంలో నిన్నటివరకు చైనాకు అండగా నిలిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఇపుడు డ్రాగన్‌ కంట్రీపై మండిపడుతోంది. కొవిడ్‌-19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అవసరమైన సమాచారాన్ని చైనా గుట్టుగా ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  వైరస్‌ లక్షణాలు ఎలా ఉన్నాయి? వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు ఎలా వ్యాప్తిచెందుతోంది? మరణాలు సంభవించేందుకు అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలపై సమాచారాన్ని పూర్తిగా డీకోడ్‌ చేసినా… ఆ వివరాలను తమతో పంచుకోలేదని ఆరోపించింది. తమవద్ద వివరణాత్మక డేటా లేకపోవడం వల్ల వైరస్‌ ఎంత త్వరగా వ్యాపిస్తుందో గుర్తించడం కూడా కష్టతరమవుతోందని చెప్పుకొచ్చింది.

Read: అమెరికాలో భారతీయుల దుకాణాలు లూటీ