Xi Jinping : హాట్ టాపిక్‌గా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ స్పీచ్ .. తైవాన్ చైనాలో కలవక తప్పదంటూ వార్నింగ్

కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ రెండుగంటలపాటు ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్‌గా మారింది. వార్నింగ్ లతో మొదలుపెట్టిన జిన్ పింగ్ రానున్న ఐదేళ్లతో ఏం చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేశారు. తైవాన్ చైనాలో కలవక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Xi Jinping : హాట్ టాపిక్‌గా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ స్పీచ్ .. తైవాన్ చైనాలో కలవక తప్పదంటూ వార్నింగ్

Xi Jinping opens Chinese Communist party

Xi Jinping opens Chinese Communist party : చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్.. ఉక్కు పిడికిలి బిగించేందుకు సిద్ధమయ్యారు. తైవాన్‌ను ఆక్రమించడం కూడా ఖాయమేనని ప్రకటించేశారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో.. చైనా తన సైనిక సామర్థ్యాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు జిన్ పింగ్ స్పీచ్ మీదే వరల్డ్ వైడ్ డిబేట్ మొదలైంది. ఇంతకీ.. ప్రపంచానికి జిన్ పింగ్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి?

చైనా అంటేనే డేంజర్. జిన్ పింగ్ ప్రెసిడెంట్ అయ్యాక.. డేంజర్ డోస్ మరింత పెంచారు. ఎప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు. ఏ వ్యూహంతో ముందుకెళ్తారో ఊహించలేం. పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకి అలవాటు. కానీ.. ఇప్పుడు ఏకంగా వార్ బెల్స్ మోగిస్తున్నారు. భారత సరిహద్దుల్లో ఘర్షణలైనా.. తైవాన్‌ని ఆక్రమించుకునే ప్లాన్ అయినా.. చైనా ఇప్పుడు పొరుగు దేశాలకు పక్కలో బల్లెంలా మారింది. తాజాగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో జిన్ పింగ్ చేసిన ప్రసంగం.. రాబోయే రోజుల్లో చైనా అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయాన్ని తెలియజేసింది. 2 వేల 3 వందల మంది పార్టీ ప్రతినిధుల మధ్య.. 2 గంటలకు పైగా ప్రసంగించిన జిన్ పింగ్.. చైనా జాతీయ భద్రత గురించే ప్రధానంగా ప్రస్తావించారు. హాంకాంగ్‌పై.. డ్రాగన్ పూర్తి నియంత్రణ సాధించిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇదే సమయంలో.. తైవాన్‌ని ఆక్రమించడం ఖాయమన్న విషయం తెలియజేశారు.

మావో జెడాంగ్ తర్వాత.. చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు జిన్ పింగ్ ప్రయత్నిస్తున్నారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎన్నికవడం కూడా లాంఛనమే అంటున్నారు. అయితే.. జిన్ పింగ్ తన ప్రసంగంలో సెక్యూరిటీకి అంశాన్నే.. ప్రధానంగా ప్రస్తావించారు. ఇది.. చైనాను యుద్ధమార్గంలో తీసుకెళ్తుందని కొందరు నమ్ముతున్నారు. తన పూర్తి స్పీచ్‌లో జిన్ పింగ్.. 89 సార్లు సెక్యూరిటీ, సేఫ్టీ గురించి ప్రస్తావించారు. 2017లో జరిగిన సీపీసీ కాంగ్రెస్‌లో 55 సార్లు సెక్యూరిటీ అనే పదాన్ని వాడారు. రానున్న రోజుల్లో పరిస్థితులు కాస్త తీవ్రంగా ఉంటాయని.. శాంతి సమయాల్లో ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలని.. ఏం జరిగినా తట్టుకునేందుకు అంతా సంసిద్ధులై ఉండాలని.. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు జిన్‌పింగ్. జాతీయ భద్రతను కాపాడునే కెపాసిటీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఆహారం, ఇంధన సప్లై వ్యవస్థను స్థిరంగా ఉంచడంతో పాటు విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

తైవాన్‌ ఆక్రమణకు సంబంధించి జిన్ పింగ్ కీలక ప్రకటన చేశారు. ఏదో ఒకరోజు తైవాన్ చైనాలో కలిసిపోతుందని.. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదని ప్రకటించారు. జిన్ పింగ్ చేసిన ఈ ప్రకటన కలకలం రేపుతోంది. ఇప్పటికే.. అన్నింటిని చేర్చుకున్నామని.. ఇక మిగిలింది తైవాన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆ దేశంపై నియంత్రణ సాధించే ప్రయత్నంలో బలప్రయోగం చేసే హక్కును.. చైనా ఎప్పటికీ వదులుకోదని తేల్చి చెప్పారు జిన్ పింగ్. అయినప్పటికీ.. శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తుందన్నారు. తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం చైనా ప్రజల సొంత విషయమని.. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్లేనని చెప్పారు. తైవాన్ ప్రజలను.. చైనా ఎప్పుడూ గౌరవించిందని.. కేర్ తీసుకుందని.. వారి ప్రయోజనం కోసమే ఆలోచించిందని.. జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ జలసంధి ద్వారా ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించామని కూడా చెనా చెబుతోంది. తైవాన్‌ను శాంతియుతంగా తిరిగి విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని.. బలప్రయోగం చేయబోమని మాత్రం ఎన్నిటికీ హామీ ఇవ్వలేమని హెచ్చరించారు జిన్ పింగ్.

ఇక.. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాను జిన్ పింగ్ పరోక్షంగా హెచ్చరించారు. బయటి శక్తులు, తైవాన్‌లోని అతి కొద్ది మంది ఇండిపెండెన్స్ సపోర్టర్లు లక్ష్యంగా తమ చర్యలు ఉంటాయన్నారు. చైనా రీయూనిఫికేషన్ సాధించి తీరతామని.. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులందరి మధ్యలో ప్రకటించారు. ఇక.. ఎప్పుడూ ఆందోళనలతో గందరగోళంగా ఉండే హాంకాంగ్‌ను కూడా విజయవంతంగా పరిపాలనవైపు మళ్లించామన్నారు జిన్ పింగ్. హాంకాంగ్‌కు.. అటానమీతో కూడిన ఓ దేశం, రెండు వ్యవస్థల విధానమే సరైందన్నారు. దీర్ఘకాలం పాటు దీనికే కట్టుబడి ఉండాలన్నారు. హాంకాంగ్‌ను దేశభక్తులే పాలించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో కలిసి ఉండేందుకు.. హాంకాంగ్‌కు ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని చెప్పారు.

అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాతో కూడిన ఆకస్ కూటములను ఉద్దేశించి.. జిన్ పింగ్ పరోక్షంగా కామెంట్ చేశారు. చైనాకు వ్యతిరేకంగా.. ఏకపక్షంగా ఏర్పాటయ్యే గ్రూపులను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే, అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇటు దక్షిణ చైనా సముద్రంలో వివిధ దేశాలతో నెలకొన్న వివాదాలను మాత్రం జిన్ పింగ్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా.. ప్రపంచ భద్రతకు చైనా కట్టుబడి ఉంటుందన్నారు జిన్ పింగ్.

గడిచిన ఐదేళ్లలో పార్టీతో పాటు తన పాలనపైనా మరింత పట్టు పెంచుకున్నారు జిన్‌పింగ్. భద్రత, బలమైన మిలటరీ, ధృడమైన దౌత్యం, బలమైన ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమిస్తూ.. దేశాన్ని ముందుకు నడిపించారు. అయితే.. ఆ మధ్యకాలంలో.. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించింది. పార్టీపైనా, పాలనపైనా నియంత్రణ సాధించేందుకు.. జాతీయ భద్రత అనే అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో.. చైనా అనేక ప్రమాదాలను ఎదుర్కొంటుందని.. దేశం ఒక యుద్ధం లాంటి పరిస్థితుల్లో చిక్కుకుందని.. వీటన్నింటి నుంచి బయటపడేసే రక్షకుడు తానొక్కడినేని.. తనన ప్రొజెక్ట్ చేసుకున్నారు జిన్ పింగ్. దీంతో.. అతను.. చైనా ప్రజలను ఏకం చేయగలడని.. కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. చైనాపై.. తన అధికారాన్ని, పట్టును కోల్పోకుండా.. జిన్ పింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.