ఐపీఎల్ జట్ల పకడ్బంధీ ప్లాన్: ప్రాక్టీస్ కోసం పాట్లు తప్పడం లేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నెలల తరబడి నిరీక్షించిన ఐపీఎల్ మరో ఐదు వారాల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితం అవగా.. ఎట్టకేలకు అన్నీ అనుమతులతో ఈ బడా ఈవెంట్ ను రెడీ చేస్తుంది బీసీసీఐ. టోర్నీ వచ్చేస్తుంది మరి ప్రాక్టీస్ విషయానొకిస్తే కొందరు పర్సనల్ గా ఇళ్ల దగ్గరే మొదలుపెట్టేశారు.

జట్టు మొత్తాన్ని ఒక చోటుకు చేర్చి ప్రాక్టీస్ ఇప్పించాలనే ఉద్దేశ్యంతో ఫ్రాంచైజీలు టెస్టులు చేయించడానికి పూనుకున్నాయి. దాంతో పాటు ఆగష్టు 20కే దుబాయ్ కు బయల్దేరాలనే ప్లానింగ్ తో పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నారు. ఐదారు నెలల ఖాళీ తర్వాత ఆరంభం కానున్న లీగ్ లో ఆడి రాణించడం కాస్త కష్టమే.

అందుకే ముందుగా ప్రాక్టీస్ ను పెంచాలనుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఈ మేర నెట్ బౌలర్లను కూడా తమతో పాటే దుబాయ్ తీసుకుపోనున్నారు. దేశవాళీ బౌలర్లను ఎంచుకుని.. దుబాయ్‌లో నెట్‌బౌలర్లుగా ఉపయోగించుకోవాలని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ప్లాన్. చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పదేసి మంది, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరుగురిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఆటగాళ్లు, సిబ్బందితో పాటే వీరికి ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.

వీరి వివరాలను ఫ్రాంఛైజీలు లీగ్‌ నిర్వాహకులకు అందజేయనున్నాయి. వాళ్లు కూడా బయో బబుల్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. స్టేడియం, హోటళ్లను దాటి ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. టోర్నీ ఆరంభమయ్యాక వీరిని స్వదేశానికి పంపించేయాలని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి.

‘అంతా అనుకున్నట్లు జరిగితే ప్రాక్టీస్‌ కోసం మా జట్టుతో పాటు పది మంది నెట్‌ బౌలర్లను తీసుకెళ్తాం. టోర్నీ మొదలయ్యే వరకు వాళ్లు జట్టుతో కొనసాగుతారు’ అని సూపర్‌కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. ‘మేం రంజీ ట్రోఫీలో ఆడిన వాళ్లే కాక.. అండర్‌-23, అండర్‌-19 స్థాయిలో జాతీయ టోర్నీలాడిన బౌలర్లను ఎంచుకుంటున్నాం’ అని కోల్‌కతా ప్రతినిధి అన్నారు.

ఐపీఎల్‌ నిబంధన ప్రకారం.. యూఏఈకి ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 24 మంది ఆటగాళ్లను మాత్రమే తీసుకెళ్లాలి. మరి నెట్‌బౌలర్లను ఆ జాబితాలో కలిపి చూస్తే కష్టమే. వీరి కోసం ఐపీఎల్‌ పాలక మండలి నుంచి ఫ్రాంఛైజీలు ప్రత్యేకంగా అనుమతి తీసుకునేట్లుగానే కనిపిస్తున్నాయి.

Related Posts