IPL 2020, MIvsDC: ఢిల్లీ ఢమాల్.. సరదాగా గెలిచేశారు

IPL 2020, MIvsDC: ఢిల్లీ ఢమాల్.. సరదాగా గెలిచేశారు

IPL 2020: ఢిల్లీపై ముంబై ఇండియన్స్ సునాయాసంగా గెలిచేశారు. 111పరుగుల టార్గెట్‌ను అలవోకగా చేధించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (72; 47బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సులు), సూర్య కుమార్ యాదవ్(12)కలిసి మ్యాచ్ ను గెలిపించారు. క్వింటాన్ డికాక్(26)ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలోనే ముంబై జట్టు విజయతీరాలకు చేరింది.

ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి జట్టు ముంబైకి స్వల్ప లక్ష్యాన్ని ముందుంచింది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (25), రిషబ్ పంత్‌ (21), రవిచంద్రన్‌ అశ్విన్‌ (12), రబడ (12), హెట్‌మెయిర్‌ (11), పృథ్వీషా (10), ధావన్‌ (0) నిలకడలేమి జట్టును కుదేలు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, బూమ్రా చెరో 3 వికెట్లు పడటొట్టగా.. కౌల్టర్‌ నిల్‌, రాహుల్‌ చాహర్‌ చెరో వికెట్‌ తీయగలిగారు.



తొలి ఓవర్‌ నుంచే వికెట్టు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వికెట్ చేజార్చుకోవడం మొదలు పెట్టారు. బౌల్ట్‌ తొలి ఓవర్‌లో ఓపెనర్‌ ధావన్‌ డకౌట్‌గా.. మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ పృథ్వీషా (10)ను ఔట్‌ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇలా ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది.

శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్‌ నిదానంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించినా భాగస్వామ్య లోపంతో నిలదొక్కుకోలేకపోయారు. నాలుగో ఓవర్‌లో మూడు, ఐదో ఓవర్‌లో ఒకటి, ఆరో ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే రాబట్టారు. ఎనిమిదో ఓవర్‌లో అయ్యర్‌ సిక్స్‌ బాదడంతో అప్పటి వరకు కేవలం 3 ఫోర్లు, 1 సిక్స్‌ మాత్రమే నమోదైంది.

తొమ్మిదో ఓవర్‌లో 4, పదో ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే రావడంతో మొత్తం 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాహుల్‌ చాహర్‌ వేసిన 11వ ఓవర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ (25) డికాక్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో బూమ్రా 2 వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

తొలి బంతికి స్టోనీస్‌ (2), నాలుగో బంతికి పంత్‌ (21) వికెట్లు సమర్పించుకున్నారు. 14వ ఓవర్‌లో పటేల్‌ (5)ను పెవిలియన్‌ చేర్చాడు. కౌల్టర్‌ నిల్‌ బౌలింగ్‌లో 16వ ఓవర్‌ హెట్‌మెయిర్‌ (11) కూడా మైదానంలో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కృనాల్‌ పాండ్యా చేతికి చిక్కి ఔటయ్యాడు. 19వ ఓవర్‌లో బౌల్ట్‌ అశ్విన్‌ (12)ను ఔట్‌ చేయగా.. చివరి ఓవర్‌లో చివరి బంతికి రబాడ (12)ను బూమ్రా అవుట్ చేయడంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.