IPL 2020: SRH vs RCB మ్యాచ్‌లో రికార్డ్‌లు ఇవే!

  • Published By: vamsi ,Published On : September 22, 2020 / 07:41 AM IST
IPL 2020: SRH vs RCB మ్యాచ్‌లో రికార్డ్‌లు ఇవే!

IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతి రోజు మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. హోరాహోరీ పోరులో చివరివరకు గెలుపు ఎవరిదో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపిఎల్ 2020 మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. దేవదత్ పాడిక్కల్, డివిలియర్స్ అర్ధ సెంచరీలు, ఛాహల్ అధ్బుత బౌలింగ్ మ్యాచ్‌ని రాయల్ ఛాలెంజర్స్ ఖాతాలో పడేలా చేసింది . ఈ మ్యాచ్‌లో ఏ రికార్డులు సృష్టించారో, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

200 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్‌గా డివిలియర్స్:
ఈ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ డివిలియర్స్ 51 పరుగులు చేశాడు. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ రెండు సిక్సులు కొట్టాడు. దీంతో ఆర్‌సిబి తరఫున 200 సిక్సర్లు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా డివిలియర్స్ నిలిచాడు. ఆర్‌సిబి తరపున డివిలియర్స్‌కు 201 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో, క్రిస్ గేల్ 239 సిక్సర్లతో ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు.



ఫస్ట్ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన పాడిక్కల్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వచ్చిన దేవదత్ పాడిక్కల్ 56 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ పూర్తిచేశాడు. దీంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో యాభై పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడు (20 ఏళ్లు 76 రోజులు)గా పాడిక్కల్ నిలిచాడు. అంతకుముందు శ్రీవాట్స్ గోస్వామి 19ఏళ్ల వయసులో తొలి మ్యాచ్‌లో యాభై పరుగులు చేశాడు.

అంతకాదు.. ఆర్‌సిబి కోసం తొలి మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా పాడిక్కల్ నిలిచారు. క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.



ఆర్‌సిబితో జరిగిన చివరి 10 మ్యాచ్‌ల్లో మొదటిసారి వార్నర్ డబుల్ డిజిట్ స్కోర్ చెయ్యలేకపోయాడు

ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆరు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆర్‌సిబితో జరిగిన చివరి 10 మ్యాచ్‌ల్లో తొలిసారిగా అతను డబుల్ డిజిట్ స్కోర్ చెయ్యలేదు. అంతకుముందు ఆర్‌సిబిపై ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 50 పరుగులకు పైగా చేశాడు.



ఎనిమిది ఐపిఎల్ ఫ్రాంచైజీల కోసం ఆడిన ఆరోన్ ఫించ్:
ఐపీఎల్ 2020 సీజన్‌లో RCB కోసం ఆడిన ఆరోన్ ఫించ్.. ఐపిఎల్‌లో అత్యధికంగా ఎనిమిది ఫ్రాంచైజీలు తరుఫున ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆరు ఫ్రాంచైజీలతో ఆడినందుకు కానూ దినేష్ కార్తీక్ మరియు పార్థివ్ పటేల్ రెండవ స్థానంలో ఉన్నారు.



కెప్టెన్‌గా కోహ్లీకి 50 వ విజయం:
టీమిండియా కెప్టెన్‌గా మంచి విజయాలు అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్‌లో కూడా మంచి రికార్డ్‌లకు చేరువ అవుతున్నారు. లేటెస్ట్‌గా SRHపై ఈ విజయంతో కోహ్లీ 111 మ్యాచ్‌ల్లో 50 మ్యాచ్‌లను కెప్టెన్‌గా గెలిచాడు. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో 50 కి పైగా మ్యాచ్‌లు గెలిచిన నాలుగో కెప్టెన్‌గా అవతరించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉంది.