రాణించిన నితీశ్ రాణా.. KKR స్కోరు 172.. చెన్నైని కట్టడి చేస్తేనే..!

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 09:44 PM IST
రాణించిన నితీశ్ రాణా.. KKR స్కోరు 172.. చెన్నైని కట్టడి చేస్తేనే..!

KKR vs CSK : ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభం అదిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది.



ప్రత్యర్థి చెన్నై జట్టుకు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా ఓపెనర్లలో శుభ్ మాన్ గిల్ (26) పరుగులకే పరిమితం కాగా.. మరో ఓపెనర్ నితీష్ రాణా (61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు)87 పరుగులతో రాణించాడు.

ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ స్కోరు రాబట్టాడు. గిల్, రాణా కలిసి తొలిసారి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మకు బౌలింగ్‌లో రెండో బంతికే గిల్ (26) వెనుదిరిగాడు.



ఆ తర్వాత నరైన్ (7) ఒక సిక్సర్ బాదినా ఎక్కువ సేపు నిలువలేదు. ఆ తర్వాత వచ్చిన రింకూ సింగ్ (11) చేతులేత్తేశాడు. చెలరేగిన నితీశ్ రాణా.. వరుస బౌండరీలు బాదుతూ జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు. ఒక దశలో రాణా దూకుడుకు ఎంగిడి బ్రేక్ వేశాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్ తొలి బంతిని రాణా ఆడబోయి సామ్ కరన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దినేశ్ కార్తీక్, కెప్టెన్ మోర్గాన్‌తో కలిసి బౌండరీలు బాదారు. కాసేపటికి మోర్గాన్ (15) ఔటయ్యాడు.



కార్తీక్ (21 నాటౌట్), త్రిపాఠి (3 నాటౌట్)గా ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా.. కరణ్ శర్మ జడేజా, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు చెన్నై కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోల్ కతాకు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో 5 స్థానంలో ఉంది.

పంజాబ్‌కు రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే కేకేఆర్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. చెన్నైకి నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బౌలర్లు కట్టడి చేస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి.