కోల్‌కతా కష్టమేనా.. ప్లే ఆఫ్‌కు అడుగుదూరంలో బెంగళూరు

కోల్‌కతా కష్టమేనా.. ప్లే ఆఫ్‌కు అడుగుదూరంలో బెంగళూరు

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ బెంగళూరుకు భళే కలిసొచ్చింది. గత సీజన్ల వైఫల్యాలను పక్కకుపెట్టి చక్కటి ప్రదర్శన చేస్తుంది. ప్లేఆఫ్ కోసం జరుగుతున్న పోరులో ముందంజ వేసింది. పదో మ్యాచ్‌ ఆడిన ఆర్సీబీ ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ (4-2-8-3) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంచలన బౌలింగ్‌ ప్రదర్శనకు చాహల్‌ (2/15) స్పిన్ తోడవడంతో 8 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.

మొదట నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 84 పరుగులే చేసింది. 30 పరుగులు చేసిన కెప్టెన్‌ మోర్గానే టాప్‌స్కోరర్‌. బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో కోల్‌కతా బౌలర్లు అద్భుతాలు చేసే అవకాశమేమీ ఇవ్వలేదు బెంగళూరు ఓపెనర్లు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై నెమ్మదిగా ఆడటం మంచిది కాదనో ఏమో.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (25), ఆరోన్‌ ఫించ్‌ (16) దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు.



పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 44/0గా ఉంది. అప్పటికే సగానికి పైగా లక్ష్యం కరిగిపోవడంతో కోల్‌కతాకు అవకాశమే లేదని తేలిపోయింది. 7వ ఓవర్లో ఓపెనర్‌లు ఇద్దరూ వెనుదిరిగినా.. గుర్‌కీరత్‌ (21 నాటౌట్‌), కోహ్లి (18 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి మిగతా పని పూర్తి చేశారు.
https://10tv.in/rajasthan-farmers-are-using-cow-urine-extensively-in-organic-farming-selling-at-up-to-rs-30-to-50-a-liter-in-the-wholesale-market/
యూఏఈలో పిచ్‌లన్నీ నెమ్మదించినప్పటికీ.. అబుదాబిలో ఓ మోస్తరు స్కోర్లే నమోదవుతున్న నేపథ్యంలో కోల్‌కతా టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్లో మోరిస్‌ను జాగ్రత్తగా ఆడుకున్న ఓపెనర్లు గిల్‌, త్రిపాఠి కలిసి 3 పరుగులే చేశారు. ఆశ్చర్యకరంగా సిరాజ్‌ రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు.

గత మ్యాచ్‌లలో 3 ఓవర్లలో వికెట్‌ లేకుండా 44 పరుగులిచ్చిన సిరాజ్‌ బంతిని అందుకోవడంతో కోల్‌కతా స్కోరు బోర్డు పరుగులు పెడుతుందనుకున్న వారి అంచనాలు తారుమారయ్యాయి.

సిరాజ్‌ ఔట్‌ స్వింగర్‌ను ఆడబోయి డివిలియర్స్‌కు దొరికిపోయాడు త్రిపాఠి (1). రాణా క్రీజులోకి అడుగు పెట్టగానే ఓ కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్‌ చేసి వెనక్కి పంపించేశాడు సిరాజ్‌. తర్వాతి ఓవర్లో బాంటన్‌ (10) డ్రైవ్‌ షాట్‌ ఆడబోయి మళ్లీ ఏబీకే దొరికిపోయాడు.

చాహల్‌ మిడిలార్డర్‌ పని పట్టగా.. గిల్ ఒక వికెట్ (సైని)ని పడగొట్టాడు. మోర్గాన్‌ పట్టుదలతో క్రీజులో నిలిచి జట్టు మరీ కుప్పకూలిపోకుండా చూసినా 57 పరుగుల వద్ద ఏడో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. చివర్లో ఫెర్గ్యూసన్‌ (19 నాటౌట్‌) కొన్ని షాట్లు ఆడబట్టి కోల్‌కతా ఆమాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది.