IPL 2020 : టాప్ ర్యాంకులో ముంబై.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 06:26 AM IST
IPL 2020 : టాప్ ర్యాంకులో ముంబై.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం

mumbai indians beat royal challengers bangalore : ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 లో అదరగొడుతోంది. వరుస విజయాలు సాధిస్తూ..ఒంటరిగా టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించింది. ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం ముంబై ఇండియన్స్ – బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును ఓడించింది.



తొలుత టాస్ ఓడి మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇందులో దేవ్ దత్ (74) చక్కగా రాణించాడు. భారీ స్కోరు సాధించే దిశగా వెళుతున్న బెంగళూరు జట్టును బుమ్రా (3/14) కట్టడి చేశాడు. దేవ్ దత్ 30 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో ఓపెనర్ ఫిలిప్ ధాటిగానే ఆడాడు. పవర్‌ ప్లేలో (54/0) ఓవర్‌కు 9 పరుగుల రన్‌రేట్‌ నమోదైంది.



జోరుగా సాగిపోతున్న బెంగళూరు జోరుకు ఫిలిప్ ను ఔట్ చేయడం ద్వారా రాహుల్ చహర్ బ్రేక్ వేశాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి (9) సహా ఎవరూ నిలబడలేదు. 11.2 ఓవర్లలో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు. కానీ అనూహ్యంగా కోహ్లి వికెట్‌తో పాటే బెంగళూరు ఇన్నింగ్స్‌ పతనమైంది. పరుగుల రాక కష్టమైంది. దాంతో బెంగళూరు జట్టు చివరి 5 ఓవర్లలో 35 పరుగులే చేసింది. డివిలియర్స్‌ (15), దూబే (2), మోరిస్‌ (4) విఫలమయ్యారు.



తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో సూర్య కుమార్ యాదవ్ చక్కటి పోరాటం కనబర్చాడు. బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. ఓపెనర్లు డికాక్ (18), ఇషాన్ కిషన్ (25) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పవర్‌ ప్లేలోనే డికాక్‌ ఔట్‌కాగా… కాసేపటికే ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన వారిలో సౌరభ్‌ తివారి (5), పాండ్యా బ్రదర్స్‌ కృనాల్‌ (10), హార్దిక్‌ (15) పెద్దగా స్కోర్లు చేయలేదు.



వీళ్లకు తోడుగా సూర్య కుమార్‌ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో సిరాజ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతినే యాదవ్‌ బౌండరీకి తరలించడంతో ముంబై విజయం (19.1 ఓవర్లలో 166 పరుగులు) సాధించింది. 79 పరుగులు చేసిన సూర్య కుమార్ నాటౌట్ గా నిలిచాడు.