CSK vs RCB: ధోనీ వర్సెస్ కోహ్లీ.. అసలైన మ్యాచ్

ఐపీఎల్ 2021.. 14వ సీజన్‌లో భాగంగా.. ఓ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ..

CSK vs RCB: ధోనీ వర్సెస్ కోహ్లీ.. అసలైన మ్యాచ్

Dhoni Kohli

CSK vs RCB: ఐపీఎల్ 2021.. 14వ సీజన్‌లో భాగంగా.. ఓ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందే రెండు జట్ల పేర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అన్ని జట్ల అభిమానుల కళ్లన్నీ ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల మధ్య జరిగే యుద్ధం మీదే. ఎవరు గెలిచినా.. ఇంకెవరు ఓడినా.. హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా.

చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ విరాట్ కోహ్లీ. ఒకరకంగా వీరిద్దరూ గురుశిష్యులే. చెన్నై సూపర్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. విన్నింగ్ ప్రాబబిలటీ 56-44 శాతంగా ఉంది.

ఈ మ్యాచ్‌లో బెంగళూరుకే విజయావకాశాలు ఉన్నాయని నెటిజన్ల అంచనా. రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్ అవుతుండగా.. నాలుగింటినీ గెలిచిన కోహ్లీ టీమ్.. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు గెలిచి రెండో ప్లేస్‌లో నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ధోనీదే పైచేయి. బెంగళూరుపై చెన్నై జట్టు మొత్తం 17 సార్లు విజయం సాధిస్తే 9 కోహ్లీసేన తొమ్మిది సార్లు గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆర్సీబీ అత్యధిక స్కోరు 205 పరుగులు కాగా.. చెన్నై 208 రన్లు చేసింది.

బెంగళూరు జట్టు ఇప్పటిదాకా ఐపీఎల్ కప్‌ను ముద్దాడలేదు. ధోనీసేన మూడుసార్లు ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. 2010, 2011, 2018లో టైటిల్ ఎగురేసుకెళ్లింది.

బెంగళూరు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్ వంటి హిట్టర్లు, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, నవ్‌దీప్ షైనీ, యజువేంద్ర చాహల్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.

చెన్నై కూడా అంతే. ఆ జట్టులో ఓపెనర్లు మొదలుకుని లోయర్ ఆర్డర్ వరకూ బ్యాటింగ్ చేయగల సమర్థలు ఉన్నారు. డుఫ్లెసిస్, ధోనీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సామ్ కుర్రన్, శార్దుల్ ఠాకూర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. రెండు సమవుజ్జీల మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందనేది 2రోజుల ముందు నుంచే ఉత్కంఠతకు గురి చేస్తోంది.