IPL 2021: గురు శిష్యుల పోరాటం.. ప్రాక్టీస్ లేకున్నా చెన్నై గెలిచేనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 14)లో భాగంగా రెండో మ్యాచ్ భారీ అంచనాల మధ్య జరగనుంది. రెండు జట్ల మధ్య కంటే గురు శిష్యుల మధ్య పోరాటంలా కనిపిస్తుంది...

IPL 2021: గురు శిష్యుల పోరాటం.. ప్రాక్టీస్ లేకున్నా చెన్నై గెలిచేనా

Ipl 2021 Csk Vs Dc Rishabh Pant Vs Ms Dhoni

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 14)లో భాగంగా రెండో మ్యాచ్ భారీ అంచనాల మధ్య జరగనుంది. రెండు జట్ల మధ్య కంటే గురు శిష్యుల మధ్య పోరాటంలా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. ముంబైలోని వాంఖడే వేదికగా జరగాల్సి ఉన్న మ్యాచ్ కు ఇరు జట్లతో పాటు లక్షల్లో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ షార్ట్ ఫార్మాట్ లో ఇరు జట్లు ఇప్పటికే 23 సార్లు తలపడటం గమనార్హం.

జరిగిన మ్యాచ్ లలో 15 విజయాలతో ముగించింది ధోనీసేన. ఢిల్లీకి 8మ్యాచ్ లు మాత్రమే అనుకూలించాయి. ఒక మ్యాచ్‌ ఫలితం తేలకుండా ఉండిపోయింది. చివరి ఐదు మ్యాచులు మాత్రం హోరాహోరీగా సాగాయి. 2020లో రెండు మ్యాచుల్లోనూ గతేడాది జరిగిన సీజన్లో ఢిల్లీదే పైచేయిగా నిలిచింది. 2019లో మాత్రం పూర్తిగా ధోనీసేనదే ఆధిపత్యం. రెండు లీగు మ్యాచులు, రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీని బోల్తా కొట్టించింది.

ప్రస్తుతం యువకులు, సీనియర్లతో ఢిల్లీ పటిష్ఠంగా ఉంది. జట్టు మేళవింపు, కోచింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. ఆటగాళ్లంతా జోరు మీదున్నారు. బౌలింగ్‌ పరంగా దిల్లీకి తిరుగులేదు. దక్షిణాఫ్రికా ద్వయం కగిసో రబాడా, ఆన్రిచ్‌ నార్జె గతేడాది ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. వేగవంతమైన బంతులు విసిరి బెంబేలెత్తించారు. కొన్ని రోజుల క్రితమే భారత్‌కు చేరుకున్న వీరిద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు. అందుబాటులో ఉండటం సందేహంగా మారిన తరుణంలో తొలి మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, క్రిస్‌ వోక్స్‌ కొత్త బంతిని పంచుకుంటారు. కరోనాతో అక్షర్‌ పటేల్‌ ఐసోలేషన్‌లో ఉండటంతో స్పిన్‌ విభాగంలో అశ్విన్‌ కీలకంగా మారనున్నాడు. చెన్నై కెప్టెన్ ధోనీనే టార్గెట్ గా చేసుకుని వ్యూహాలు రచించగలడు.

ఇంగ్లాండ్‌ వన్డేల్లో శిఖర్‌ ధావన్‌ దంచికొట్టాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా తప్పుల్ని సరిదిద్దుకొని వీరోచితంగా ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. విజయ్‌ హజారేలో 4 సెంచరీలతో 827 పరుగులు చేశాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై ఏకంగా సిరీసులే గెలిపించేశాడు. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. దీనికి తోడు ఏకంగా సౌరబ్ గంగూలీనే పర్సనల్ గా కాంప్లిమెంట్లు ఇస్తున్నాడు. గతేడాది రాణించిన స్టాయినిస్‌, హెట్‌మైయిర్‌కు ఈసారి శామ్‌ బిల్లింగ్స్‌ జత కలిశాడు. విలువైన సీనియర్లు రహానె, స్టీవ్‌ స్మిత్‌ అండగా ఉన్నారు.

సీనియర్లతో చెన్నై
చెన్నై జట్టు కాగితంపై బలంగా కనిపిస్తున్నా బరిలోకి దిగాక ఎలా ఉంటుందో సందేహమే. వ్యూహరచనలో దిట్ట అయిన ఎంఎస్ ‌ధోనీకి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కొరత కనిపిస్తుంది. అందుకే గతేడాది మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్రను రవీంద్ర జడేజా పోషించాడు. ఆ తర్వాత గాయపడటంతో టీమిండియాకు దూరమై మళ్లీ ఇప్పుడే మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. సురేశ్‌ రైనా రాకతో జట్టు బలం పెరిగింది. అంబటి రాయుడు ఆడితే తిరుగులేదు. వీరిద్దరూ జనవరిలో ఆఖరి మ్యాచ్‌ ఆడటం గమనార్హం.

డుప్లెసిస్‌ చివరగా పీఎస్‌ఎల్‌లో ఆడాడు. బ్రావో పరిస్థితీ అంతే. మొయిన్‌ అలీ టీమిండియా సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో సరైన అవకాశాలు రాలేదు. కేవలం శామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రమే ఫామ్‌లో కనిపిస్తున్నారు. దీపక్‌ చాహర్‌కూ అవకాశాలు రాకపోవడంతో ఫామ్ సందేహమే. కోట్లు పెట్టి కొన్న కృష్ణప్ప గౌతమ్‌ పై పెట్టుకున్న అంచనాలు ఏం చేస్తాడో చూడాలి.