IPL 2021: రాజస్థాన్‌కు కాస్త ఊరట.. కోల్‌కతా ఫలితంపై షారూఖ్ సైలెన్స్

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పుంజుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ పేలవంగా ఓడిన రాజస్థాన్.. ముంబైలోని వాంఖడే వేదికగా శనివారం రాత్రి...

IPL 2021: రాజస్థాన్‌కు కాస్త ఊరట.. కోల్‌కతా ఫలితంపై షారూఖ్ సైలెన్స్

Rr Vs Kkr (1)

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పుంజుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ పేలవంగా ఓడిన రాజస్థాన్.. ముంబైలోని వాంఖడే వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని కెప్టెన్ సంజు శాంసన్ (42 నాటౌట్: 41 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తాజా సీజన్‌లో ఐదో మ్యాచ్‌ ఆడిన రాజస్థాన్‌కి ఇది రెండో గెలుపుకాగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి వరుసగా నాలుగో ఓటమి. దాంతో.. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానానికి పడిపోయింది కోల్‌కతా. రాజస్థాన్ రెండో గెలుపుతో ఆఖరి ఆరో స్థానానికి ఎగబాకింది.

134 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కి మెరుగైన ఆరంభమేమీ లభించలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (4: 5 బంతుల్లో 1 ఫోర్) తక్కువ స్కోరుకే ఔటవగా.. తాజా సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడిన మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (22: 17 బంతుల్లో 5ఫోర్లు) కాసేపు దూకుడుగా ఆడేశాడు. కానీ.. పవర్ ప్లే ముగిసేలోపే ఇద్దరూ పెవిలియన్‌కి చేరిపోయారు.

నెం.3లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ చివరి వరకూ సహనాన్ని కనబరిచాడు. శివమ్ దూబె (22: 18 బంతుల్లో 2ఫోర్లు, సిక్సు)తో కలిసి రాజస్థాన్ స్కోరు బోర్డుని నడిపించిన సంజు శాంసన్.. ఆ తర్వాత రాహుల్ తెవాటియా (5: 8 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (24: 23 బంతుల్లో 3ఫోర్లు)తో చక్కటి సమన్వయం కనబర్చాడు.

కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రయత్నాలు తిప్పికొడుతూ.. పట్టుదలతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. మరో 7 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ 134/4తో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, ప్రసీద్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. కోల్‌కతా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు శుభమన్ గిల్ (11), నితీశ్ రానా (22) అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. దాంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి కోల్‌కతా టీమ్ శుభమ్ గిల్ వికెట్ కోల్పోయి 25 పరుగులే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి (36) దూకుడుగా ఆడినా.. మరో ఎండ్‌లో సునీల్ నరైన్ (6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0) పేలవంగా ఔటైపోయారు.

రాహుల్ త్రిపాఠి ఔౌట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్ (9) ఒక సిక్స్ మాత్రమే కొట్టి వికెట్ చేజార్చుకోగా.. దినేశ్ కార్తీక్ (25) 18వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా గేర్ మార్చలేకపోయాడు. ఆఖర్లో పాట్ కమిన్స్ (10) ఒక సిక్స్, శివమ్ మావి (5) ఒక ఫోర్‌తో సరిపెట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్ 4వికెట్లు పడగొట్టగా.. జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు.

రెండు మ్యాచ్ లుగా కోల్‌కతా ఫలితంపై స్పందిస్తున్న షారూఖ్ ఈ సారి ఊరకుండిపోయాడు. మొదట పరాజయానికి అభిమానులకు క్షమాపణలు చెప్పిన కింగ్ ఖాన్.. మూడోసారి పరాజయానికి ముందు జట్టుకు సపోర్టింగ్ గా మాట్లాడాడు. పరవాలేదని ప్రోత్సహించాడు. నాలుగో ఓటమితో మాటల్లేవమ్మా అంటూ ట్విట్టర్ ఖాతా మూగబోయింది.