IPL 2021 : భారత్‌లో కరోనా విలయం : ఐపీఎల్‌కు భారీదెబ్బ.. ఒక్కొక్కరిగా ఇంటిదారిపడుతున్న ఆటగాళ్లు

IPL 2021 : భారత్‌లో కరోనా విలయం : ఐపీఎల్‌కు భారీదెబ్బ.. ఒక్కొక్కరిగా ఇంటిదారిపడుతున్న ఆటగాళ్లు

Ipl Hit By Player Exodus As Covid Cases Surge

Ipl 2021:2021 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ టోర్నీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)ను ఇండియాలోనే బయోబబుల్‌లో (Biobubble) నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కరోనా భయమో లేదా బయోబబుల్ లో ఇమడలేకనో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్ మధ్యలోనే ఇంటి దారిపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వ్యక్తిగత కారణాల పేరు చెప్పి తప్పుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐదు మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఆడలేమంటూ చేతులేత్తేస్తున్నారు.


అందరికి కంటే ముందుగా మన భారతీయ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. తన కుటుంబం కరోనాతో పోరాడుతోందని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఐపీఎల్ కు విరామం ప్రకటించాడు. పరిస్థితులు కుదుటపడితే తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వెళ్లి పోయాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై జట్టును వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. వీరంతా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చెప్పి ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యారు.



కరోనా-లాక్ డౌన్ భయమే కారణమా? :
అడమ్ జంపా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటి వరకు బెంగళూరు 5 మ్యాచ్‌లు ఆడగా జంపా బెంచ్ పైనే ఉన్నాడు. కేన్ రిచర్డ్‌సన్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ నుంచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా ప్లేయర్ల సంఖ్య వీరితో మూడుకు చేరింది. అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ప్రాంచైజీ జట్టు కూడా వీరి నిర్ణయాన్ని స్వాగతించింది. ఐపీఎల్ నుంచి ఒక్కో ప్లేయర్ వెళ్లిపోవడం మిగతా ఆటగాళ్లలో ఆందోళన పెరుగుతోంది. భారతదేశంలో రోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడంతోనే ఆటగాళ్లంతా ఐపీఎల్ నుంచి వెళ్లిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. గత ఏడాదిలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా కూడా యూఏఈ టోర్నీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆండ్రా టైకి కూడా లాక్ డౌన్ భయం పట్టుకుంది. ఇప్పటికే పలు దేశాలు ఇండియాను కరోనా కేసుల దృష్ట్యా రెడ్ లిస్టులో పెట్టేశాయి. ఐపీఎల్ లో కొనసాగితే తానిక్కడే లాక్ అయిపోతాననే భయంతో ఆండ్రూ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.





బయోబబుల్ నుంచి తోటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో తాను కూడా వెళ్లిపోయాడు. బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయాడు. లియామ్ లివింగ్‌స్టన్ బయోబబుల్‌లో ఉండలేనంటూ ఇంటికి వెళ్లిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ వదిలి వెళితే జట్టుకు పెద్ద దెబ్బే.. ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉంది. ఈ సమయంలో వార్నర్ జట్టుకు ఎంతో కీలకం.. వార్నర్ వెళ్లిపోతే హైదరాబాద్ జట్టును ఆదుకోనేది ఒక్కడే.. అతడే కేన్ విలియమ్‌సన్‌.. ఇతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ జట్టు బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది.



ఆటగాళ్లను పర్యవేక్షిస్తున్న సీఏ, ఈసీబీ :
క్రికెట్ ఆస్ట్రేలియా (CA), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికేట్ బోర్డు (ECB) ఐపిఎల్‌లో ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లలో భయాందోళనకు గురిచేయొద్దని నిర్ణయించాయి. ఐపిఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు, కోచ్‌లు వ్యాఖ్యాతలతో సీఏ, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాయి. ఐపీఎల్ తర్వాత తమ ఆటగాళ్లతో వచ్చే జూన్ నెలలో వెస్టిండీస్ టూర్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తోంది. కానీ, చాలామంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ పూర్తి టోర్నమెంట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో సరిహద్దులు మూసేస్తుందని వార్తల నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ త్వరగా తమ దేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఇండియా నుంచి వచ్చే విమానాలను నిషేధించాలని ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ గత వారం రాజస్థాన్ రాయల్స్ క్యాంప్ నుంచి నిష్క్రమించాడు. కానీ, ఐపిఎల్ ముగిసే వరకు వెనక్కి తగ్గడంపై మరే ఆటగాడు ఆందోళన వ్యక్తం చేయలేదని ఈసీబీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత ప్రాతిపదికన ఆటగాళ్లను పర్యవేక్షించడంపై దృష్టిపెట్టామని ఇసిబి ప్రతినిధి ఒకరు తెలిపారు.



స్టేడియంలో గెస్టుల అనుమతి తగ్గింపు :
ఐపీఎల్ సమయంలో భారతీయ క్రికెట్ బోర్డు (BCCI) కోవిడ్-19 నిబంధనల విషయంలో అందరికి సందేశాలు పంపుతోంది. వాటాదారులు, ఆటగాళ్లు, బ్రాడ్ క్యాస్టర్లతో సహా అందరికి కోవిడ్ ప్రోటోకాల్స్ కు సంబంధించి సందేశాలు పంపుతోంది. ప్రభుత్వంతో ఎప్పటికప్పుడూ టచ్ లోనే ఉంటోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్టేడియంలోకి అనుమతించే గెస్టుల రాకను తగ్గించింది. ఇప్పటివరకూ 200 మందికి మాత్రమే అనుమతి ఉండేది.. వారిలో ఫ్రాంచైచీ గెస్టులు, బీసీసీఐ, రాష్ట్ర అధికారులు ఉన్నారు. స్టేడియాల్లో 75 మంది కంటే ఎక్కువ మందికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఒక్కో ఫ్రాంచైజీ నుంచి 20 మందికి మాత్రమే అనుమతి ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆటగాళ్ల అందరికి వ్యాక్సిన్ :
ఐపీఎల్ ఆటగాళ్లకు వ్యాక్సిన్ వేయించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ సమయంలో ఆటగాళ్లందరికి వ్యాక్సిన్ వేయించేందుకు వివిధ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ కు బయల్దేరడానికి ముందే అందరి ఆటగాళ్లకు వ్యాక్సిన్ అందించాలని భావిస్తోంది.