Home » ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదం ఉంది – ఇరాన్ హెచ్చరికలు
Published
2 months agoon
By
madhuIran’s allies on high alert : ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికార పీఠాన్ని వీడే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ మిత్రదేశాలకు సూచించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని తెలిపింది. ఇటీవలే అగ్రరాజ్యంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పై బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే..ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించడం లేదు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే ఇరాన్ పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాలపై ట్రంప్ ఆరా తీశారని, దీనివల్ల పొంచి ఉన్న ముప్పులను అధికారులు తెలియచేశారని తెలుస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ అప్రమత్తమైంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనే చివరి రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకొనే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఇరాన్..తన మిత్రదేశాలకు హెచ్చరికలు పంపింది. వచ్చే రెండు నెలలు ట్రంప్‌నకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత స్థాయి జనరల్ ఆదేశ మిత్రపక్షాలకు సందేశం పంపినిట్లు సమాచారం.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్య ఆంక్షలు కూడా విధించారు. ఇరాన్ అత్యున్నత స్థాయి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీపై దాడి చేయించి..ఆయన మరణానికి కారణమయ్యారు. అమెరికా చర్యకు ఇరాన్ ధీటుగానే సమాధానం ఇచ్చింది. ఇరాక్ లో యూఎస్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిపింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.