బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా? కార్యకర్తల్లో అనుమానాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనతో కలసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలసి ముందుకు సాగాలని డిసైడ్‌ అయ్యాయి. ఈ విషయాన్ని రెండు పార్టీల కార్యకర్తలకు కూడా చెప్పారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం విశాఖ జిల్లాకు వర్తించదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు. జిల్లాలో ఇప్పటి వరకూ ఎక్కడా ఈ పార్టీలు కలసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు.

ఫలితాల తర్వాత నామ మాత్రంగా కార్యక్రమాలు:
2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్‌ కల్యాణ్, విశాఖ ఎంపీగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పోటీ చేయడం, మాజీ మంత్రి బాలరాజు, చింతలపూడి లాంటి నేతలు పార్టీలో ఉండడంతో జనసేన పార్టీ జిల్లాలో బలంగా కనిపించింది.

కానీ, పోటీ చేసిన ఎవరూ గెలవకపోవడం.. లక్ష్మీనారాయణ, బాలరాజు, చింతలపూడి లాంటి నేతలు పార్టీని వీడటంతో ఏదో నామమాత్రమపు కార్యక్రమాలే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రత్యక్షంగా ఎక్కడా కార్యక్రమాలు జరగకపోయినా అడపా దడపా పెట్టే ప్రెస్‌మీట్లలో కూడా బీజేపీ, జనసేన పార్టీల నేతలు కలవడం లేదు. విడివిడిగానే పెడుతున్నారు.

అసలు బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా?
జిల్లాలో సంగతి పక్కన పెడితే విశాఖ నగరంలో పరిస్థితి సరే సరీ. బీజేపీ మాజీ శాసనసభా పక్షా నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కలసి ప్రెస్‌మీట్లు పెడుతున్నా జనసేన నేతలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంత వరకూ రెండు పార్టీల నేతలు కలిసి ఆందోళనలు నిర్వహించ లేదు కూడా. జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ సభ్యుడు శివసాగర్, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి నేతలున్నారు.

వారు కూడా ఏదో అప్పుడప్పుడు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప బీజేపీ నేతలతో కలసి మాత్రం చేపట్టడం లేదు. దీంతో ఆ పార్టీ నేతల్లోనే అసలు బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరికి వారే యమునా తీరే:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖ పర్యటకు వచ్చినా మర్యాద కోసమైనా జిల్లా జనసేన నేతలు కలుసుకోలేదంట. విశాఖ జిల్లాలో సింహాచలం దేవస్థానంలో అక్రమాలపై ధార్మిక సంఘాలు, జనసేన నేతలు కలిసి నిరసనలు చేపట్టినా బీజేపీ నేతలు గానీ.. ఆ పార్టీ అనుబంధ సంఘాలు కానీ పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయ్యింది. బీజేపీ ఆధ్వర్యంలో అంతర్వేది విషయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ ధర్నా అనే బ్యానర్ కనిపించింది కానీ జనసేన నేతలు ఎక్కడా కనిపించ లేదు. ఎవరికి వారే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారే తప్ప కలసి మాత్రం కార్యక్రమాలు చేపట్టకపోవడంపై అయోమయం నెలకొంది. అధినేతలు కలుగజేసుకొని ఈ విషయంలో ఒక మాట చెబితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

Related Posts