దావూద్‌ ఇబ్రహీం జాడపై మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం.. ప్రపంచ మాఫియా చరిత్రలో ముంబై నగరానికి ఒక అధ్యాయం జోడించిన డాన్. కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియాను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లిన నేరస్తుడు. సాధారణ స్మగ్లింగ్‌కు నిలయమైన ముంబై నగరంలోకి మొదటిసారి ఆర్‌డి‌ఎక్స్ ను తీసుకొచ్చిన అంతర్జాతీయ స్మగ్లర్.

బాంబు పేలుళ్లతో ఇండియా వాణిజ్య రాజధాని ముంబైలో వినాశనం సృష్టించిన ఉగ్రవాది. బాలీవుడ్ సినిమాను, అంతర్జాతీయ క్రికెట్‌ను కను సైగలతో నడిపించిన హై ప్రొఫైల్ క్రిమినల్. ఇలా చెప్పుకుంటూ పొతే దావూద్ ఇబ్రహీంకు చాలా పెద్ద చరిత్ర ఉంది.దావూద్ ఇబ్రహీం తాజాగా వార్తలకెక్కాడు. పాకిస్తాన్ నాటకం బట్టబయలైంది. ఇన్నాళ్లుగా భారత్ చెబుతున్నదే నిజమని తేలిపోయింది. పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా దావూద్ తమ దేశం లోనే ఉన్నాడని ఒప్పుకుంది. పాతికేళ్లుగా ఇండియా ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రుజువులు చూపినా పాకిస్తాన్ తోసిపుచ్చింది. దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే లేడని బొంకింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా టెర్రరిస్టు ముద్ర వేసినా దావూద్‌ను కడుపులో పెట్టుకుని కాపాడింది పాకిస్తాన్. మరిప్పుడెందుకు బైట పెట్టింది?

FATF… ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ప్రపంచ దేశాలు 1989లో ఏర్పాటు చేసుకున్న ఒక నిఘా సంస్థ. G-7 దేశాల చొరవతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల్లో మనీ లాండరింగ్‌ను ఎదుర్కోడానికి విధివిధానాలు రూపొందించడానికి ఏర్పాటు చేశారు. 2001లో ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం అందించడం కూడా ఇందులో చేర్చారు. పారిస్ కేంద్ర కార్యాలయం నుంచి పని చేస్తుంది.FATFకు దావూద్ ఇబ్రహీంకు సంబంధం ఏమిటి? ఉంది. చాలా పెద్ద సంబంధమే ఉంది. దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్తాన్ ఒప్పుకోడానికి కారణం. పాకిస్తాన్‌పై FATF బిగిసినందువల్లనే పాకిస్తాన్ దారికొచ్చింది. కలుగులో పొగబెడితేగానీ ఎలుక బయటకు రాదు.
ఇప్పుడదే జరిగింది. FATF పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే గడువు ముంచుకొచ్చింది. దెబ్బకు దావూద్ ఇబ్రహీం పేరు బయటకొచ్చింది.

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాదుల ఆర్ధిక కార్యకలాపాలకు రక్షణ కల్పించడం అనే నేరాలు పాకిస్తాన్‌పై ఉన్నాయి. అందుకే FATF పాకిస్తాన్‌ను మొదట గ్రే లిస్టులో పెట్టింది. ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం, మనీ లాండరింగ్‌పై 27 సూత్రాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. పాకిస్తాన్ బ్లాక్ లిస్టు నుంచి తప్పించు కోవాలంటే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. అందుకు ఇప్పటికే రెండు సార్లు పాకిస్తాన్‌కు గడువు పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబరు తుది గడువు విధించింది.బ్లాక్ లిస్ట్‌లో పెడితే ఏమౌతుంది? :
పాకిస్తాన్‌ఫై అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షలు విధిస్తారు. ఉత్తర కొరియా, ఇరాన్‌పై విధించినట్లుగా ఆంక్షలు విధిస్తారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌తో ఎలాటి ఆర్ధిక సంబంధాలూ పెట్టుకోవు. పాకిస్తాన్‌కు ఎక్కడా పైసా అప్పు పుట్టదు. ఒక రకంగా ఇదొక వెలి. ఇదొక సంఘ బహిష్కరణ. అదే జరిగితే పాకిస్తాన్ మనుగడ కష్టం అవుతుంది.

READ  ఇమ్రాన్ వక్రబుద్ధి : కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

ఇప్పటికే ఆర్ధికంగా దివాళా ఎదుర్కుంటున్న పాకిస్తాన్‌కు రోజు గడవడం కష్టం. ఇతరత్రా కూడా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బలు బాగా తగిలాయి. దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ముద్ర వేసింది. ఉగ్రవాదులపై, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని అమెరికా మండిపడింది.

ఈ ఉక్కపోత తట్టుకోలేక పాకిస్తాన్ దిగొచ్చింది. పాతికేళ్లుగా బుకాయిస్తూ వస్తున్న నిజాన్ని ఒప్పుకుంది. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన ముద్దాయి దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని మొట్టమొదటిసారిగా అంగీకరించింది.88 ఉగ్రవాద సంస్థలు, నేతలపై ఆర్ధిక ఆంక్షలు :
అంతే కాదు.. మొత్తం 88 ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై ఆర్ధిక ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఐసిస్, అల్ ఖైదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. భారత్‌పై గురిపెట్టిన లష్కరే తయ్యబా, జైషే మొహమ్మద్, వాటి అనుబంధ సంస్థలకు, నేతలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి.

దావూద్ ఇబ్రహీం, హాఫిజ్ సయీద్, మసూద్ అజర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ ఈ జాబితాలో ఉన్నారు. పాకిస్తాన్‌లో ఉన్న వీరి ఆస్తులు , బ్యాంకు, అకౌంట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాళ్ళ విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించారు.ఆర్ధికంగా దివాళా ఎదుర్కుంటున్న పాకిస్తాన్ ఇప్పటికే ఆర్ధిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు దరఖాస్తు చేసుకుంది . ఆర్ధిక సాయం కోసం పాక్ ప్రధాని ప్రపంచ దేశాలన్నీ తిరిగారు . చిరకాల మిత్రుడు సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ కు మొండి చెయ్యి చూపింది.

ఖతార్ , ఇరాన్ , టర్కీ తో కలిసి ముస్లిం దేశాల్లో కొత్త ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తోందని సౌదీ అరేబియా పాకిస్తాన్ పై నిప్పులు చెరుగుతోంది . అన్ని దారులూ మూసుకుపోయేసరికి ఇక ఇమ్రాన్ ఖాన్ కు వేరే దారి కనిపించలేదు. మరో పక్క FATF గడువు సమీపిస్తోంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ దిగి వచ్చారు. ఫలితంగా కలుగులో ఉన్న దావూద్ గుట్టు వెలుగులోకి రాకతప్పలేదు.

Related Posts