లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రాజోల్‌లో సత్తా చాటిన జనసేన..12 పంచాయతీలు కైవసం.. ఎమ్మెల్యే రాపాకకు షాక్‌

Published

on

Janasena wins 12 panchayats : ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ఊసే లేదన్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ నుంచి గెలుపొందిన నేతే ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికలతో సమాధానం చెప్పారు ఆ పార్టీ సానుభూతిపరులు. రాష్ట్రమంతా అధికార పార్టీ హవా నడుస్తున్నా.. ఆ నియోజకవర్గంలో మాత్రం తమ గుర్తింపును చాటి చెప్పారు.. మరి ఏంటా నియోజకవర్గం.. ఎవరిదా పార్టీ..?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం.. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ నియోజకవర్గానికి చెందినవారే.. ఎన్నికల్లో రాపాకను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు జనసైనకులు తీవ్ర స్థాయిలో కృషి చేశారు. కానీ ఒక సమయంలో రాపాక నేను గెలవడానికి పార్టీకీ సంబంధం లేదు. కేవలం నా వ్యక్తిగత పరపతి వల్లే విజయం సాధించానని చెప్పారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా రాపాక వరప్రసాద్.. అధికార పార్టీ వైసీపీకి సానుభూతిపరుడిగా మారిపోయారు. ఇటీవల కాలంలో తన కొడుకును సిఎం వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలో దగ్గరుండి చేర్పించారు రాపాక.

ఎన్నికల తర్వాత పరిణామాలతో నియోజకవర్గంలో రాపాకకు.. జనసైనికులకు మధ్య దూరం క్రమంగా పెరిగింది. రాపాక కార్యక్రమాలను జనసేన కార్యకర్తలు పూర్తిగా పక్కన పెట్టి.. స్థానికంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడా కార్యక్రమాలే.. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు గెలిచి.. రాపాకకు షాక్‌ ఇచ్చేలా చేశాయి. అసలు జనసేన ఊసే లేదన్న వాళ్ళకు.. రాజోలు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతిచ్చిన సర్పంచ్‌ అభ్యర్థులు పన్నెండు స్థానాల్లో విజయం సాధించి ఎమ్మెల్యేకు ఎదురు నిలిచారు. జనసేన పార్టీకి సరైన నాయకత్వం మిగతా స్థానాల్లో.. లేకపోయినా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజోలు నియోజక వర్గంలో 62 గ్రామ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో వైసీపీ 37 స్థానాల్లో విజయం సాధించగా… టీడీపీ 13 స్థానాల్లోనూ, జనసేన 12 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించాయి. జనసేన పార్టీ సానుభూతి పరులుగా పోటి చేసిన అనేక మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. రాజోలు నియోకవర్గంలో టేకిశెట్టిపాలెం, పడమటిపాలెం, కేశవదాసుపాలెం, మేడిచర్లపాలెం, బట్టేలంక, రామరాజులంక, కత్తిమండ, సఖినేటిపల్లి లంక, అంతర్వేదికర, గోగున్నమఠం, తూర్పుపాలెం గ్రామాల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్ధులు గెలిచి వైసిపి నాయకులకు షాకు ఇచ్చారు.

అసలు రాజోలు నియోజక వర్గంలో జనసేన లేదు అన్న ఎమ్మెల్యే మాటలకు పంచాయతీ ఎన్నికల్లో విజయంతో సమాధానం చెప్పారు. నడిపించే నాయకుడు లేనప్పటికీ అధికార ఒత్తిడిలు ఉన్నప్పటికీ.. గెలుపు కోసం కష్టపడి విజయాన్ని సొంతం చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. ఇప్పుడీ గెలుపుతో జనసేన కొత్త ఉత్సహంతో ముందుకు సాగుతుందని స్థానిక నేతలు అంటున్నారు.