Home » అసోంలో అల్లర్లు… జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు!
Published
1 year agoon
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం అట్టుడుకిపోతుంది. అసోం వివిధ చోట్ల చెలరేగిన అల్లర్లలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ప్రధాని మోడీ విజ్ణప్తిని కూడా పట్టించుకోకుండా అసోంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తన భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ప్రకటించిన 24గంటల్లోనే జపాన్ ప్రధానమంత్రి కూడా భారత పర్యటన రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన మొదలవుతుంది. డిసెంబర్-15,2019న గౌహతిలో జరగనున్న వార్షిక ఇండియా-జపాన్ సమ్మిట్ లో భారత ప్రధాని మోడీతో షింజో అబే సమావేశం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గౌహతి సహా మొత్తం అసోం ఆందోళనలతో తగలబడుతోంది.
దీంతో షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకునే ఆలోచన చేస్తున్నట్లు జపాన్ కి చెందిన మీడియా రిపోర్ట్ చేసింది. జపాన్ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదని గురువారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ కూడా తెలిపిన విషయం తెలిసిందే.