లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ – జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్ష

Published

on

JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబంపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరును నిరసిస్తూ ఇవాళ్టి నుంచి దీక్షకు దిగుతుండడం…. తాడిపత్రిలో టెన్షన్‌ రేపుతోంది.

తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమపై అక్రమంగా పెట్టిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరసిస్తూ జేసీ బ్రదర్స్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతుండడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. తాడిపత్రిలో ఈనెల 31 వరకు 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు.

వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుల దాడులు ప్రతి దాడులు.. అరెస్టులతో కొద్దిరోజుల కిందట తాడిపత్రి అట్టుడికింది. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి రావడానికి సమయం పట్టే అవకాశమూ ఉంది. ఈ గొడవల్లో ఇరువర్గాలకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినా.. ఇక్కడ ఇంకా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. తాజాగా జేసీ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో తీవ్రంగా స్పందించిన జేసీ దివాకర్‌రెడ్డి.. తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

తనపై పెట్టిన అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునే వరకు ఆమరణ దీక్ష చేస్తానని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రకటించడంతో తాడిపత్రిలో హైటెన్షన్‌ నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ అనుచరుల ఘర్షణ తర్వాత పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా దీక్ష చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు, పోలీసు చట్టం వంటి.. ఎన్ని నిబంధనలు అమల్లో ఉన్నా.. దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అరెస్టులు చేస్తే చేసుకోండంటూ జేసీ సవాల్‌ విసరడంతో.. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. తన సోదరుడు జేసీ ప్రభాకరెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వదిలేదిలేదని దివాకర్‌రెడ్డి ప్రకటించారు. దీక్షకు తరలిరావాలని తన అనుచరులు, మద్దతుదార్లకు పిలుపు ఇవ్వడంతో తాడిపత్రికి దారి తీసే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు.

ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు నాలుగు వాహనాలతో వెళ్లడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా లోపాలు బయటపడ్డాయి. అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు సిద్ధమవ్వడంతో.. గ్రామాల్లో కూడా ఇరు పార్టీల నేతల మధ్య టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

జేసీ బ్రదర్స్‌తోపాటు.. వారి తనయులు కూడా పెద్దారెడ్డితో అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్దారెడ్డితోపాటు… కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా జేసీ బ్రదర్స్‌ కథేంటో చూడాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తాడిపత్రిలో ఆందోళన సర్వత్రా నెలకొంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ సోదరులపై అణచివేత కార్యక్రమం ప్రారంభమైంది. ట్రాన్స్‌ పోర్ట్‌ వ్యాపారం, మైనింగ్‌ సంస్థలపై కేసులు పడ్డాయి. జేసీ ప్రభాకరెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. త్రిశూల్‌ సిమెంట్స్‌ అక్రమ మైనింగ్‌కేసులో వంద కోట్ల రూపాయల జరిమానా పడింది. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు జేసీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వారికి టీడీపీ అండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎవరిని నమ్ముకున్నా ఏం ప్రయోజనం లేదనుకున్న జేసీ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు.

మరోవైపు జేసీ సోదరులు తలపెట్టిన దీక్షపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉనికి కాపాడుకునేందుకే దీక్ష అంటూ విరుచుకుపడ్డారు. మొత్తంమీద అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్తలు ఏ పరిణామాలకు దారితీస్తాయోమోన్న భయం అందరిలో నెలకొని ఉంది.