JEE, NEETపై ముందడుగే…6 రాష్ట్రాల పిటిషిన్ కొట్టేసిన సుప్రీం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జేఈఈ, నీట్‌ పరీక్షలను నిర్వహించొచ్చునన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ(సెప్టెంబర్-4,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది.



విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ప్రవేశపరీక్షలను వాయిదా వేయడానికి తిరస్కరిస్తూ ఆగస్టు 17న సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.  జేఈఈ, నీట్ వాయిదా కోరుతూ 11రాష్ట్రాలకు చెందిన 11మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషిన్ ను అప్పుడు సుప్రీం కొట్టివేసింది.

అయితే, కరోనా నేపథ్యంలో విద్యార్థుల ‘జీవించే హక్కును కాపాడటంలోనూ, పరీక్షకు హాజరయ్యేందుకు రవాణా వసతుల లేమిని న్యాయస్థానం విస్మరించిందని, .ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల మంత్రులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.



ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు…. ఇప్పటికే కేంద్రం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు కూడా సన్నద్ధులై ఉంటారని, ఇలాంటి తరుణంలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదని అభిప్రాయపడింది.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున అందుకు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, పరీక్ష కేంద్రాలను శుద్ధి చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం వంటి చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలంటూ ప్రభుత్వాలకు సూచించింది.

Related Posts