Home » కశ్మీర్ లో ఎన్నికల సందడి…నేడే మొదటి దశ DDC పోలింగ్
Published
2 months agoon
J&K DDC polls చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో జరుగనున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల పోలింగ్ ఇవాళ నుంచి ప్రారంభం అవుతోంది. కఠినమైన కోవిడ్-సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. అంతేకాకుండా, ఆర్టికల్ 370 ను రద్దు చేయడానికి ముందు జమ్మూ కశ్మీర్ కి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ లేనందున ఇవి మొదటి డిడిసి ఎన్నికలు కూడా.
మొత్తం నలభై మూడు నియోజకవర్గాలు (కాశ్మీర్ లోయలో 25, జమ్మూ ప్రాంతంలో 18)మొదటి దశ పోలింగ్ లో ఉన్నాయి. పోటీలో ఉన్న 296 మంది అభ్యర్థుల విధిని 7 లక్షల మంది ఓటర్లు నిర్ణయిస్తారు.
ఓటర్లు మరియు పోలింగ్ సిబ్బంది మాస్క్ లు ధరించడం తప్పనిసరి, మరియు కోవిడ్ -19 సోకిన ఓటర్లు మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య ఓటు వేస్తారు అని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కాగా,గుప్కర్ కూటమి అభ్యర్థులు కాశ్మీర్ లోయలో స్వేచ్ఛగా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారన్న పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ వాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిరస్కరించారు. కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో సరైన భద్రత లేకుండా ప్రచారం చేయడం సురక్షితం కాదని ఆయన అన్నారు.