Johnson & Johnson exits fairness cream market, but what about competitors?

ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు నిలిపివేత…జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమెరికాలోని మిన్నియాపోలీస్ సిటీ పోలీసుల చేతిలో నల్లజాతీయుడు  జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురైన విషయం తెలిసిందే.  నల్లజాతీయుడు హత్య తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి తన వంతు మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్  ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్ని కూడా ఆపివేసినట్టు తెలిపింది. 

భారతదేశం సహా ఇతర  ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు  ఉండవని తెలిపింది.  అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. అయితే కంపెనీ వ్యాపారంపై ఇది పెద్దగా ప్రభావం చూపదని ఎందుకంటే దాని మార్కెట్ వాటా చాలా తక్కువ అని జేజే ప్రతినిధి చెప్పారు.

సాహసోపేతమైన తమ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. నల్లమచ్చల్ని తొలగించుకొని అందంగా, తెల్లగా అవ్వమంటూ తమ ఉత్పత్తి పేర్లు లేదా ప్రచారం సాగిందని, మీ సొంత స్కిన్ టోన్ కంటే మెరిసిపోవాలంటూ తెల్ల రంగును హైలైట్ చేసిందని తెలిపింది. నిజానికి తమ ఉద్దేశం అది కాదని,  ఆరోగ్యకరమైన చర్మం అందమైన చర్మం తమ ఉద్దేశ్యమని కంపెనీ తెలిపింది. 

మరోవైపు, జాన్సన్ అండ్ జాన్సన్ నిర్ణయం తరువాత ఇతర కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసే ధైర్యం చేస్తాయా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. దేశీయ ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్లో 2019లో సుమారు 450 మిలియన్ల డాలర్ల మార్కెట్ వాటా వున్న, ఇతర ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దీనిని అనుసరించకపోవచ్చన్నారు. బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న విషయం  తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి అనేక భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. 

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే  ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫెయిర్‌నెస్ క్రీములు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులతో సహా సుమారు 6,277 టన్నుల స్కిన్ లైట్‌నర్ అమ్ముడుబోయింది.  

Related Posts