లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

దశాబ్దాల కల నెరవేరిన వేళ….కర్నూలు న్యాయ రాజధాని

Published

on

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫల లభించిందని బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా వాళ్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. దీంతో గవర్నర్‌ నిర్ణయం సర్వత్రా హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు నగరం న్యాయ రాజధానిగా మారబోతోంది. దీంతో ఆ జిల్లాకు చెందిన బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర సంబరాలు జరుపుకున్నారు.

కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని బార్‌ కౌన్సిల్‌ సభ్యులు అభినందించారు. దశాబ్దాల తమ కల ఇప్పుడు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల… రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానులతో ప్రాంతీయ అసమానతలు ఉండబోవని వారు అభిప్రాయపడ్డారు.రాయలసీమ అంటేనే అభివృద్ధికి ఆమడదూరంగా ఉండే ప్రాంతం. అక్కడి నుంచి ఎంతమంది సీఎంలు వచ్చినా… సీమ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా సీమ జిల్లా నుంచి వచ్చినవారే. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో… రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఏళ్ల తరబడిగా వెనుకబడ్డ రాయలసీమకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో… కర్నూలును న్యాయ రాజధానిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో హైకోర్టుతో పాటు అన్ని జ్యుడిషియల్ బెంచ్‌లు … మొత్తం న్యాయవ్యవస్థ కర్నూలుకు తరలివస్తుంది.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల కాలం నుంచి ఉంది. ఆ డిమాండ్ నేడు నేరవేరతుండటంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్నూలులో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోదముద్ర లభించడంతో…తాత్కాలిక హైకోర్టు భవన ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్ క్యాంప్ లేదా నగరంలోని కొన్ని ఆఫీసు భవనాలను అధికారులు చూసే అవకాశం ఉంది.

కర్నూలు సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ శాశ్వత హైకోర్టు నిర్మాణానికి అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఓర్వకల్లు విమానాశ్రయం సమీపంలో గతంలోనే భూ సేకరణ చేశారు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటుకు అవకాశముంది.కర్నూలు నగర సమీపంలోని ఓర్వకల్లు దగ్గర ప్రభుత్వ భూమి అధికంగా ఉంది. ఈప్రాంతం హైకోర్టు నిర్మాణానికి అనుకూలమని మేధావులు చెబుతున్నారు. తుంగభద్ర నీరు పుష్కలంగా ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి హైకోర్టుకు వచ్చేవారికి ఎయిర్ పోర్టు కూడా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.

అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నంద్యాల కొత్త జిల్లాగా ఏర్పడనుంది. దీంతో హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల…. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వారవుతారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుతో కర్నూలు జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అందరూ భావిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *