లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

కొండేపి వైసీపీలో వర్గపోరు.. ఇదే అదనుగా తలదూర్చిన జూపూడి, ఆ పదవి కోసం జోరుగా లాబీయింగ్

Published

on

Jupudi Prabhakar Rao: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్‌హాట్ గా మారాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓడిపోయిన మాదాసి వెంకయ్యకు వర్గపోరు ఎక్కువయ్యిందని అంటున్నారు. పార్టీని సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర దళిత నాయకుడిగా పేరు పొందిన జూపూడి ప్రభాకర్ ఇప్పుడు కొండపి వైసీపీ ఇన్‌చార్జి పదవి కోసం వైసీపీ అధిష్టానం దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నట్లు టాక్‌. రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడిగా పని చేసిన జూపూడి.. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 2009లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీ పదవి చేపట్టారు.

మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి:
వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్‌ వెంట నడిచారు జూపూడి ప్రభాకర్‌. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. జూపూడికి కొండెపి టికెట్‌ ఇచ్చినా… స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి చేపట్టారు. 2019 ఎన్నికలు ముగిసే వరకు టీడీపీతోనే ఉన్న జూపూడి.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి కోసం లాబీయింగ్‌:
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కొనసాగడం జూపూడి నైజమని వైసీపీ నాయకులు అంటున్నారు. అందులో భాగంగానే వైసీపీ అధికారంలోకి రావడంతో కీలక నేతలతో లాబీయింగ్‌ చేసి పార్టీలో చేరారని చెబుతున్నారు. ఇప్పుడు కొండెపిలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో వర్గాలుగా విడిపోయిన నేతలతో తెరచాటుగా మంతనాలు జరుపుతున్నారని టాక్‌. నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి తనకు ఇవ్వాలంటూ వైసీపీలోని కీలక నేతలైన వైవీ సుబ్బారెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల వద్ద లాబీయింగ్‌ చేస్తున్నారని అనుకుంటున్నారు.

డాక్టర్ కావడం మాదాసికి మైనస్ అయ్యిందా?
కొండెపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ మాదాసి వెంకయ్య 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పట్ల సానుభూతితో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవితో పాటు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవులను అధిష్టానం అప్పగించింది. డాక్టర్ వృత్తిలో సాగుతున్న వెంకయ్య రాజకీయంగా అనుభవం లేకపోవడంతో వర్గ విభేదాలను కంట్రోల్‌ చేయలేకపోతున్నారని అంటున్నారు. వైసీపీ అధిష్టానం కూడా అదే అభిప్రాయంలో ఉందట. ఇప్పటికే మాదాసిపై అనేక ఫిర్యాదులు అందగా, అధిష్టానం కూడా ఆయనకు అనేక సూచనలు చేస్తూ వస్తోంది.

ఈ పరిస్థితుల్లో అసంతృప్త నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదాసిని మార్చి, వేరే వారిని నియమించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఇదే అదనుగా చేసుకొని జూపూడి రంగంలోకి దిగి, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

జూపూడికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి, జగన్‌కు చెడ్డ పేరు:
కానీ, ఇందుకు స్థానిక వైసీపీ నేతలు అంగీకరించడం లేదంట. జూపూడికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి, జగన్‌కు చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. జూపూడికి అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో మాదాసి వెంకయ్యతోపాటు వరికూటి అశోక్ బాబు కలసి జూపూడికి వ్యతిరేకంగా పని చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారట. అప్పుడు టీడీపీ మరింత బలపడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జూపూడికి ఏదైనా ఢిల్లీ స్థాయి పదవి అప్పగించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.