kodali nani

బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువా? ఎవరూ పాటించని డిక్లరేషన్ రూల్‌ని ఉంచాలో తీసెయ్యాలో టీటీడీ బోర్డు, మత పెద్దలు ఆలోచన చేయాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విపక్షాలపై ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం మతాలు, కులాలు, దేవుళ్లను కూడా వదలడం లేదని చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీ నేతలపై కొడాలి నాని మండిపడ్డారు. బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువా అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ నాస్తికుడు అన్నారు. హిందువుల ఓట్ల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీటీడీ ఆహ్వానం మేరకు సీఎం హోదాలో జగన్ తిరుమల వెళ్తున్నారని కొడాలి నాని చెప్పారు. సీఎం జగన్ అన్ని మతాలు, కులాలను గౌరవించే వ్యక్తి అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చాలాసార్లు తిరుమల వెళ్లారని, ఎప్పుడూ డిక్లరేషన్ పై జగన్ తో చంద్రబాబు సంతకం పెట్టించ లేదని మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ పై కొడాలి నాని మరోసారి స్పందించారు. ఎవరూ పాటించని రూల్ ను ఉంచాలో తీసెయ్యాలో టీటీడీ బోర్డు, మత పెద్దలు ఆలోచన చేయాలన్నారు.

రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో వరుసగా అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తార స్థాయికి చేరిన వేళ.. తిరుమల డిక్లరేషన్ అంశం మరో చర్చనీయాంశమైంది. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే హిందువేతరులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలా? లేక ఆప్షన్ మాత్రమేనా? అనే అంశంపై ఏపీలో పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

”మన రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ హిందువేతరులను డిక్లరేషన్ కోరరు. ఆయా సందర్భాల్లో చర్చికి వెళ్లినప్పుడు ఏసుక్రీస్తును నమ్ముతావా? అని నన్నెవరూ సంతకం చేయమనలేదు. అలాగే మసీదుల్లోనూ ఈ విధానం లేదు. ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేని డిక్లరేషన్ విధానం తిరుమలలో మాత్రం ఎందుకు? నిజం చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే. కాబట్టి దాన్ని పూర్తిగా తొలగించాలి” అని మంత్రి నాని అన్నారు.

‘‘సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు ఎవరికీ లేదు. తిరుమలలో మాత్రం ఆ సంప్రదాయం ఎందుకు? కేవలం జగన్ అధికారంలోకి వచ్చినందుకే చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా?”అని నాని ప్రశ్నించారు.

READ  డిక్లరేషన్‌ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

చట్టం ఏం చెబుతోంది?
తిరుమల డిక్లరేషన్ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం పెరుగుతున్న క్రమంలో అసలు చట్టం ఏం చెబుతుందనేది కీలకంగా మారిది. తిరుమల శ్రీవారి ఆలయ పాలనా వ్యవహారాలు టీటీడీ చేతికి వచ్చిన తర్వాత సంస్థాగతంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలోనే టీటీడీ.. హిందూ మతానికి చెందిన ఓ స్వతంత్ర సంస్థగా అవతరించింది. అసెంబ్లీ ద్వారా ఆ మేరకు చట్టం కూడా తయారైంది.

ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ చట్టం, జీవో ఎంఎస్ నంబర్ 311 లోని రూల్ నంబర్ 16 ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. 1990లోనే దీనిని చట్టంగా చేశారు. కాగా, ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం సాధ్యం కాబోదంటూ టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణం అయ్యాయి.

డిక్లరేషన్ కోరడం అసాధ్యం:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటం తెలిసిందే. వాళ్లలో హిందువేతరులు ఎవరనేది గుర్తించి, పేరు పేరునా డిక్లరేషన్ తీసుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, ప్రముఖులు, వీవీఐపీలు వచ్చిన సందర్భంలో మాత్రం డిక్లరేషన్ అంశం తరచూ తెరపైకి వస్తోంది.

డిక్లరేషన్ చట్టాన్ని తొలగిస్తామని తాము అనలేదని, నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చే ఇతర మతస్తుల నుంచి డిక్లరేషన్ కోరడం సాధ్యం కాదని మాత్రమే తాను అన్నానని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు. కాగా, తిరుమలలో సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని టీడీపీ, బీజేపీలు.. జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఈలోపే డిక్లరేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

Related Posts