సొంత గూటిలో కొండా దంపతుల పకడ్డందీ వ్యూహం.. 3సీట్లకు టార్గెట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొండా కపుల్స్‌… ఓరుగల్లు పొలిటికల్ పేజీలో తిరుగులేని సంతకం వాళ్లది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు వాళ్లకే పట్టం కట్టి.. బ్రహ్మరథం పట్టారు. హ్యాట్రిక్‌ గెలుపుతో మేమున్నామనే ధైర్యమిచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. పదే పదే పార్టీలు మారడంతో ప్రజలు అయోమయంలో పడి కొండా దంపతులకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏడాదికాలంగా సైలెంట్‌గా ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఉన్నపళంగా కొండా దంపతులు పట్నం వీడి పల్లెబాట పట్టడానికి కారణం..? మళ్లీ పట్టు కోసం వేస్తున్న స్కెచ్‌ లేంటి..?

కొండా సురేఖ, మురళి దంపతులంటే వరంగల్‌ ఇలాఖాలో తెలియని వాళ్లుండరంటే నమ్మండి. ఉమ్మడి వరంగల్‌జిల్లాతో అనుబంధం ఆ రేంజ్‌లో ఉందీ దంపతులకు. పార్టీ ఏదైనా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వీళ్లదే విజయం. దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డితో దగ్గరి అనుబంధం ఉండటంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వీళ్లకి స్వర్ణయుగం నడిచింది.

కాంగ్రెస్‌లో మూడు సార్లు పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేఖ వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం జరిగిన నాటికీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ను వీడారు. జగన్‌కు దగ్గరై వైసీపీలో పార్టీలో చేరారు. అందులో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. వరంగల్ తూర్పు నుంచి కొండాసురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు.

పరకాలలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఏడాదిన్నర కాలంగా సైలెంట్‌గా ఉండిపోవాల్సి వచ్చింది కొండా దంపతులకు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో నిలకడ లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. పదే పదే పార్టీలు మారడం.. క్యాడర్‌ పక్క పార్టీలో జంప్ అవుతున్నా పట్టించుకోకపోవడం.. అసలు ఏ నియోజకవర్గం నుంచి పోటి చేస్తారోనన్న క్లారిటీ లేకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది కొండా దంపతుల పరిస్థితి.

జరగాల్సిన నష్టం జరిగాక చాలా ఆలస్యంగా మేల్కొన్నారు. ఇప్పుడు చాలా యాక్టివ్‌ అయ్యారు. వారం రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎవరికి దూరం అయ్యామోనని లెక్కలేసుకుని సామాజిక వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా దంపతులు.. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరిస్తున్నారు. చేతిలో చేయి వేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. క్యాడర్‌కి అండగా ఉంటామంటూ కొండంత భరోసా ఇస్తున్నారు. ఈ పలకరింపులు సంగతి సరే.. అసలు కొండా సురేఖ ఎక్కడినుంచి పోటీ చేస్తారు..? కొండా మురళి ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేది తెలియక కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. గతంలో అడ్డాగా ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వీడి వరంగల్ తూర్పు నుంచి సురేఖ పోటీ చేస్తారట. ఇక భూపాలపల్లి నుంచి కొండ మురళీధర్‌ రావు పోటీ చేస్తారని సమాచారం.

READ  లాక్ డౌన్ ఎత్తేస్తారా ? పొడిగిస్తారా ? అందరిలో ఉత్కంఠ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా కొండా మురళీ బాధ్యతలు తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఆయన అక్కడినుంచే నిలబడతారని తెలుస్తోంది. రెండు చోట్ల బరిలోకి గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నారట. సురేఖ కూతురు కూడా ఈసారి పోటీ చేస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. కానీ పార్టీ మూడో సీటు కూడా ఇదే ఫ్యామిలీకి ఇస్తుందా అనేది అనుమానంగానే మారింది.

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామంటున్నారు కొండా దంపతులు. తూర్పు నియోజకవర్గంలో 23 డివిజన్లలో గెలుస్తామని ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఇంతకాలం ఓ లెక్క ఇప్పుడో లెక్క అంటూ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా కొండా దంపతులు ఇప్పుడు చాకచాక్యంగా వ్యవహరిస్తూ ఇద్దరి సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.

రాజకీయ వారసురాలిని గ్రేటర్ వరంగల్ ఎన్నికల బరిలో నిలిపి ఏకంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పైగా మేయర్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో తమకు మరింత కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు. కూతురు గెలుపు ఇచ్చే కిక్‌తో వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Related Posts