రామాయణం రాసిన పదేళ్ల బాలుడు

రామాయణం రాసిన పదేళ్ల బాలుడు

రామాయణం.. హిందూ ధర్మంలో ముఖ్యమైన కథగా చెప్పుకునే రచన.. చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము చూపే ఈ కావ్యములో తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు, గురుశిష్యులు.. వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు చెప్పడం జరిగింది. రామాయణం చదవడం, వినడం వల్ల మంచి జరుగుతుంది అనేది నమ్మకం..

అటువంటి రామాయణ కావ్యమును ఓ పదేళ్ల బాలుడు లాక్‌డౌన్ సమయంలో రాయడం విశేషం. “పిలక రామాయణం” పేరుతో ఒడిశాకు చెందిన పదేళ్ల ఆయుష్‌ కుమార్‌ కుంథియా రామాయణం కావ్యములోని ముఖ్య ఘట్టములతో 104పేజీల పుస్తకాన్ని రాసి పూర్తిచేశాడు. ఈ పుస్తకాన్ని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకుని వచ్చారు.

లాక్‌డౌన్ సమయంలో రామాయణం సీరియల్ పున: ప్రసారం కాగా.. ఆ సమయంలో సీరియల్ చూడమని కుటుంబ సభ్యులు చెప్పి.. దానిలోంచి ఓ వ్యాసం రాయమని సూచించారు. అందులోని విషయాలు బాగా అర్థం చేసుకున్న ఆయుష్.. పిలక రామాయణం రాసేశారు. ప్రజలకు వినోదం.. పిల్లలకు జ్ఞానం పంచాలనే ఉద్దేశంతో గతంలో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్‌ను కేంద్రం డీడీ ఛానెల్‌లో లాక్‌డౌన్ సమయంలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

పిలక రామాయణంలో ముఖ్యంగా రాముడు అరణ్యవాసానికి బయలుదేరడం.. రావణుడు సీతను అపహరించడం.. అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడికి ప్రజలు స్వాగతం పలికే ఘట్టాలను ఆయుష్‌ తనదైన శైలిలో వివరణాత్మకంగా రాసినట్లుగా చెబుతున్నారు. టీవీలో వచ్చిన రామాయణంతో పాటు.. కొన్ని పాత పుస్తకాలను చదివి ఆయుష్ అర్థం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.