టార్గెట్‌ థౌజెండ్ : మోడీ మాస్టర్ ప్లాన్..భారత్ కు 1000 కంపెనీలు!

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 01:10 AM IST
టార్గెట్‌ థౌజెండ్ : మోడీ మాస్టర్ ప్లాన్..భారత్ కు 1000 కంపెనీలు!

టార్గెట్‌ థౌజెండ్‌.. కొడితే చైనాకు మైండ్‌ బ్లాంక్ కావాలి. లాక్‌డౌన్ అయ్యేలోగా.. పని పూర్తైపోవాలి. ఇదీ ప్రధాని మోదీ వేస్తున్న మాస్టర్‌ ప్లాన్‌. కరోనా దెబ్బకు చైనాను వదలాలనుకుంటున్న వెయ్యి కంపెనీలను ఇండియాకు రప్పించే పనిలో పడింది మోదీ సర్కార్. దానికి సరికొత్త ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది. ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తోన్న తరుణం భారత్ ముందుకు వచ్చేసింది. కరోనాతో ఓ వైపు ఆర్థిక సంక్షోభం నిట్టనిలువునా ముంచుతున్న వేళ.. చైనాపై ప్రపంచదేశాల ఆగ్రహం.. భారత్‌కి వరంగా మారబోతోంది.. చైనాకి ఫసక్ చెప్పిన వెయ్యి కంపెనీలను మన దేశానికి రప్పించేలా కేంద్రం సంప్రదింపులు మొదలెట్టేసింది

వాస్తవానికి చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లే కంపెనీలు అమెరికా, జపాన్‌వే ఎక్కువ.. కానీ స్వదేశంలో అవి వ్యాపారాలు సాగించాలంటే భూమి ధరలను భరించలేవు.  తక్కువ వేతనాలకు ఉద్యోగులూ దొరకరు. అందుకే భారత్‌ని డెస్టినేషన్‌గా ఎంచుకుంటే ఏ మేరకు లాభం చేకూరుతుందో వివరించేలా కేంద్రం ప్రయత్నాలు వేగవంతం చేసింది

ఇందుకోసం ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు వెయ్యి అమెరికా కంపెనీలను టచ్ చేసింది సెంటర్.. వీటిలో మెడ్‌ట్రోనిక్, అబాట్ లేబరేటరీస్‌లాంటి అనేక దిగ్గజ కంపెనీలు కూడా ఉండటమే ఆసక్తిగొలిపే అంశం.. మెడికల్ ఎక్విప్‌మెంట్ సప్లయర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టెక్స్ టైల్స్, లెదర్, ఆటో పార్ట్స్ మేకర్స్‌తో పాటు 550రకాల ఉత్పత్తుల తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది..
కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కూడా తమ ప్రయత్నాలు, వ్యూహాలతో సిద్ధమయ్యాయ్. విదేశీ తయారీ కంపెనీలు కనుక ఇన్వెస్ట్ చేయడానికి వస్తే.. సప్లై చైన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మహారాష్ట్ర హామీ ఇచ్చిందని తెలుస్తోంది.. దక్షిణాదినుంచి తమిళనాడు, ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్..కూడా ఈ కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయ్. ఇక ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ల్యాండ్‌ బ్యాంక్ ఉండడమూ ఆకర్షణీయంగా మారింది. ఇటు తెలంగాణ కూడా పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది. యూరప్‌ దేశాల రాయబారులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇండస్ట్రియల్ పాలసీని వివరించారు.

అమెరికాకు చెందిన చెందిన చాలా కంపెనీలు  ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాయని..వాటి దగ్గర డబ్బు  పుష్కలంగా ఉండటంతో..ఏ దేశంలో ఇన్వెస్ట్ చేసినా వాటి పంట పండినట్లేనని యూఎస్ ఇండియా  స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ప్రెసిడెంట్ ముఖేష్ అఘిలాంటి వాళ్లు చెప్తున్నారు..ఒక్క చైనాలోనే పెట్టుబడులు పెడితే ప్రయోజనం లేదనే సంగతి యూఎస్ కంపెనీలు ఇప్పుడే గుర్తించాయంటారాయన..

మరోవైపు కేంద్రం కూడా అమెరికా సహా ఏ దేశం పెట్టుబడి పెట్టడానికి వచ్చినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కాన్సెప్ట్‌తో ముందుకెళ్లాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా కేంద్ర కార్మిక చట్టాల్లో సంస్కరణలు చేస్తున్నట్లు కూడా కంపెనీలతో తెలిపింది.. తక్కువ వేతనానికే హైస్కిల్డ్ ఉద్యోగులు భారత్‌కి ప్లస్ పాయింట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రేసులో భారత్ కంటే వియత్నాం, కాంబోడియా ముందున్నా…అపరిమితమైన మార్కెట్ భారత్‌ది కాబట్టి.. తొందర్లోనే చాలా విదేశీ కంపెనీలు భారత్ బాట  పడతాయనే అంచనాలు నెలకొన్నాయి. 

చైనాపై అమెరికా ఒంటికాలిపై లేస్తోన్న వేళ..ఇక చైనాని నమ్ముకుంటే మునిగిపోవచ్చని యూఎస్ కంపెనీలు భావిస్తున్నాయంటారు. చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి రప్పించడం కోసం జపాన్ ఇప్పటికే రెండు  బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. యూరోప్ దేశాలు కూడా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఈ సమయంలోనే భారత్ వ్యూహాత్మకంగా అమెరికన్ కంపెనీలతో సంప్రదింపులు జరపడం చైనాకి మింగుడుపడని అంశంగా మారింది.

Read More :

లాక్ డౌన్ ఎఫెక్ట్…ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఏడాది పొడిగింపు

మోడీ ఐడియా: పెద్ద, చిన్న పట్టణాలు, గ్రామాలకు ‘ట్రైన్ హాస్పటల్స్’