పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా, 3 నెలలు ఆగాల్సిందే

లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 08:10 AM IST
పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా, 3 నెలలు ఆగాల్సిందే

లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర

లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావమే చూపింది. వలస కూలీలు, నిరుపేదల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. ఉపాధి లేక ఆదాయం లేక అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ శుభకార్యాలపైనా పడింది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లపై. లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన వివాహాలు అగిపోయాయి. దీంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న వారు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. అంతేకాదు, పెళ్లి చేసుకోవాలని అనుకునే వారు మరో మూడు నెలలు అంటే ఆగస్టు వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లు వాయిదా:
లాక్ డౌన్ దెబ్బకు ఏప్రిల్ లో జరగాల్సిన వివాహాలు వాయిదా పడ్డాయి. మే నెలలో పెళ్లిళ్లకు అనుమతి ఉన్నా.. 20 మందికి మించి బంధువులు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ క్రమంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు వేడుకను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లోనే వేలాది వివాహాలకు ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయని అంచనా. పెళ్లి కోసం కొందరు అప్పులు చేశారు. మరికొందరు ఉన్నదంతా అమ్ముకుని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా లాక్ డౌన్ విధించడంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఆగస్టు(శ్రావణం) వరకు మంచి ముహూర్తాలు లేవు:
వివాహ ముహూర్తాలు ఎక్కువగా (వైశాఖ, జ్యేష్ఠ మాసాలు) ఏప్రిల్, మే నెలల్లోనే ఉన్నాయి. ఆపై మూఢం వస్తుంది. జూన్ చివర్లో మొదలయ్యే ఆషాఢం జులై వరకు ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్లు ఉండవు. ఆగస్టు(శ్రావణం)లో ముహూర్తాలు కొన్నే ఉన్నాయి. దీంతో ఇప్పుడు వివాహాలు వాయిదా వేసుకున్న వారు మరో మూడు నెలల అంటే ఆగస్టు వరకు వేచిచూడక తప్పదు. పెళ్లిళ్లు ఆగిపోవడంతో పురోహితులు, సన్నాయి మేళం, అలంకరణ చేసేవాళ్లు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్ చేసేవారు.. ఇలా వేలాది కుటుంబాలపైనా ప్రభావం పడింది.

వడ్డీలు కట్టలేక అప్పులపాలు:
ఇదివరకే పిల్లల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న కొందరు పెళ్లి ఖర్చుల కోసం భూములు అమ్ముకున్నారు. విలువైన భూమిని తక్కువ ధరకే అమ్మేశారు. తీరా లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడటంతో నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఇంకొందరు పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి, వడ్డీ వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. తీరా వివాహాలు వాయిదా పడటంతో బోరుమంటున్నారు. తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని, కొత్తగా మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Here>> పెళ్లి చేస్తున్నారా? పర్మిషన్ తీసుకున్నారా?