బిగ్ బ్రేకింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లో 20మంది జవాన్లు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : June 16, 2020 / 04:43 PM IST
బిగ్ బ్రేకింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లో 20మంది జవాన్లు మృతి

సోమవారం రాత్రి లడఖ్ లోని గాల్వ‌న్ వ్యాలీలో భారత్‌-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగారు.

14వేల అడుగుల ఎత్తున ఈ రెండు అన్వాయుధ దేశాల సైనికులు కర్రలతో,రాళ్లతో తలపడ్డారు. కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో 20మంది భారత సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. గాల్వన్ వ్యాలీలో భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగిందని…1975 తర్వాత జరిగిన తొలి హింసాత్మక ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిందని భారత సైన్యం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

కాగా, సరిహద్దు ఘర్షణలో మృతి చెందిన సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. గాల్వాన్ వ్యాలీలో జ‌రిగిన తాజా ఘ‌ర్ష‌ణ‌లో..ఐదుగురు చైనా సైనికులు కూడా మృతి చెందారు. 11 మంది చైనా సైనికులు గాయపడ్డారని చైనా మౌత్ పీస్ ది గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ ట్వీట్ చేశారు.

ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌త బ‌ల‌గాలే ముందుగా హ‌ద్దుమీరిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జావో లిజియ‌న్ ఆరోపించారు. భార‌త సైన్యం దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. దాని వ‌ల్లే రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు జావో తెలిపారు. భార‌త్ త‌మ బ‌ల‌గాల‌ను హ‌ద్దుల్లో పెట్టుకోవాల‌ని, ఏకాభిప్రాయానికి త‌గిన‌ట్లు ఉండాల‌ని జావో సూచించారు.

అయితే సరిహద్దులో “ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి చైనా వైపు చేసిన ప్రయత్నం” నుండి ఈ ఘర్షణ తలెత్తిందని భారత్ తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర భారతదేశం తన కార్యకలాపాలన్నీ ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉంచిందని, చైనా వైపు కూడా అదే ఆశిస్తాం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.