ప్రత్యేక రైళ్లు : నిబంధనలివే..90 నిమిషాల ముందే రావాలి

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 12:54 AM IST
ప్రత్యేక రైళ్లు : నిబంధనలివే..90 నిమిషాల ముందే రావాలి

దేశ వ్యాప్తంగా 2020, జూన్ 01వ తేదీ సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించించారు. టికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతి ఉంటుంది. కరోనా లక్షణాలున్న ప్రయాణికులను అనుమతించబోమని స్పష్టం చేశారు. రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రయాణం చేయకపోవడమే మంచిదని తెలిపారు. గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వాళ్లు ప్రయాణించవద్దని కోరారు. 

అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు :-
ఈ 200 ప్రత్యేక రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉండవు. కాబట్టి UTS టికెట్లు కూడా ఉండవు. అన్నీ రిజర్వ్‌డ్ కోచ్‌లే. ఈ రైళ్లకు ఆన్‌లైన్‌లోనే అంటే IRCTCలోనే రైలు టికెట్లు తీసుకోవాలి. ఈ స్పెషల్‌ రైళ్లలో AC, NON AC క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారందరికీ సీటు లభిస్తుంది. జనరల్ కోచ్‌లలో సీటు బుక్ అయితే సెకండ్ సీటింగ్ ఛార్జీ వసూలు చేస్తుంది రైల్వే. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ గరిష్టంగా 30 రోజులు ఉంటుంది. 

90 నిమిషాల ముందే :-
తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్స్ ఉండవు. రైల్వే ప్రయాణికుల టికెట్ క్యాన్సలేషన్, ఫేర్ రీఫండ్ రూల్స్-2015 నిబంధనలే ప్రత్యేక రైళ్లకూ వర్తిస్తాయి. రెగ్యులర్ రైళ్లలో ఉన్నట్టే ప్రత్యేక రైళ్లలో అన్ని కోటాలు ఉంటాయి. దివ్యాంగులకు ఇచ్చే 4 రకాల కన్సెషన్స్, పేషెంట్లు ఇచ్చే 11 రకాల కన్సెక్షన్స్ ప్రత్యేక రైళ్లలోనూఒ పొందొచ్చు. ఇక రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 2 గంటల ముందు రెండో చార్ట్ రిలీజ్ అవుతుంది. టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణీకులందరికీ స్ర్కీనింగ్ :-
రైలు టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్ని రైలు ఎక్కనివ్వరు. వారికి పూర్తి రీఫండ్ ఇస్తారు. రైలు ఎక్కే ముందు ప్రయాణీకులందరికి స్క్రీనింగ్ చేస్తారు. కరోనా వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైలులోకి అనుమతిస్తారు.  ప్రయాణికులకు రైళ్లలో దుప్పట్లు, కర్టయిన్స్‌ అందించరు. అవసరం అనుకుంటే ప్రయాణికులే సొంత దుప్పట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు లేదా ఫేస్ కవర్స్ ధరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రైళ్లలో కేటరింగ్ సేవలు ఉండవు. అందుకే ప్రయాణికులు ఆహారం, నీళ్లు తీసుకెళ్లాలి. 

ఆరోగ్య సేతు యాప్ :-
ప్యాంట్రీ కార్ ఉన్న రైళ్లలో పరిమితంగా ఆహారపదార్థాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కొనుక్కోవచ్చు. రైల్వే స్టేషన్లలో స్టాల్స్ తెరిచే ఉంటాయి. ఫుడ్ ప్లాజాలో ఫుడ్ పార్శిల్స్ తీసుకోవచ్చు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించిన హెల్త్ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ 200 ప్రత్యేక రైళ్లు తప్ప ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల సేవలన్నీ రద్దు చేశామని భారతీయ రైల్వే ప్రకటించింది.