24 Hrs Rain : లోతట్టు ప్రాంత వాసులు భయపడొద్దంటున్న GHMC

  • Published By: madhu ,Published On : June 12, 2020 / 03:29 AM IST
24 Hrs Rain : లోతట్టు ప్రాంత వాసులు భయపడొద్దంటున్న GHMC

రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. దీంతో GHMC అలర్ట్ అయ్యింది. చినుకుపడితే..నగరంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఇక 24 గంటల పాటు వర్షం పడితే..ఎలాంటి సీన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా..లోతట్టు ప్రాంతాల వాసుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఈసారి నిశ్చింతంగా ఉండొచ్చని బల్దియా భరోసా ఇస్తోంది. వర్షం కారణంగా వచ్చే వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. ముంపు నుంచి వెంటనే తేరుకొనే విధంగా సర్కిల్, జోనల్ స్థాయిలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. చెట్లు కూలడం, ఇతర విపత్తులు సంభవిస్తే..వెంటనే స్పందించే విధంగా సిబ్బందిని అలర్ట్ చేసింది. మూడు షిప్టుల్లో విధులు నిర్వహించేందుకు బల్దియా సిద్ధమౌతోంది. 

ముంపు సమస్య వచ్చే ప్రాంతాలు
రాణిగంజ్ క్రాస్ రోడ్, ఆలుగడ్డ బావి, ఖైరతాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకాపూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, రాజ్ భవన్ విల్లామేరీ కాలేజీ, పంజాగుట్ట మోడల్ హౌస్, జూబ్లీహిల్స్ నీరూస్ షోరూం, జూబ్లీ హిల్స్ అపోలో క్రెడిల్ వైద్య శాల, కేసీపీ జంక్షన్, బల్కంపేట ఆర్‌యూబీ, నాంపల్లి టీ జంక్షన్, హిమాయత్ నగర్ మినర్వా హోటల్ తదితర ప్రాంతాలున్నాయి. 

మొత్తంగా హైదరాబాద్ లో 30 ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో వరద నీటిని తోడిపోసేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయక చర్యల కోసం జోనల్, సర్కిల్ స్థాయిల్లో మొబైల్ టీమ్ లను రంగంలోకి దింపారు. డీసీఎం వాహనాలతో కూడిన 87 మినీ మొబైల్ బృందాలు, జేసీబీలతో కూడిన 79 మొబైల్ మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఇందులో ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు షిప్టుల్లో పనిచేసేందుకు 101 స్టాటిక్ లేబర్ టీమ్ లను ఏర్పాటు చేశారు. వరద నివారణ చర్యల కోసం ఈ సంవత్సరం రూ. 24.53 కోట్లు కేటాయించారు. 

Read: ఇక వానలే వానలు..తెలంగాణలో రుతుపవనాల ఎంట్రీ