ఆట మధ్యలో కరోనా వస్తే పరిస్థితి ఏంటి? : ద్రవిడ్

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 01:14 AM IST
ఆట మధ్యలో కరోనా వస్తే పరిస్థితి ఏంటి? : ద్రవిడ్

బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌‌కు అనుకూలమైన వాతావరణంలో క్రికెట్‌ను పునరుద్ధరించడం అవాస్తవమని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విధానాన్ని ద్రవిడ్ వ్యతిరేకించారు. పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరగబోయే సిరీసులను బయో సెక్యూర్‌కు యోగ్యమైన వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ద్రవిడ్.. కుదిరే పని కాదన్నారు. ఈసీబీ చెబుతున్నది అవాస్తవమైనదిగా అనిపిస్తోందన్నారు. చాలా రోజులు నుంచి సిరీసులేమీ జరగకపోవడంతోనే ఆలోచిస్తోందని చెప్పారు. ఒక రక్షణ వలయం సృష్టించి నిర్వహించినా అది ప్రతి ఒక్కరికీ సాధ్యమవ్వదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం నిరవధికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఎంతో మంది జనాలు ఇందులో భాగమవుతారని ద్రవిడ్ తెలిపారు. 

పరీక్షలు, క్వారంటైన్ చేసి బయో బబుల్ సృష్టించినా టెస్టు మ్యాచు రెండో రోజు ఏ ఆటగాడికైనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారు? అని ద్రవిడ్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మళ్లీ అందరినీ క్వారంటైన్‌లో ఉంచాల్సిందేనని చెప్పారు. అప్పుడు టెస్టు మ్యాచు సాధ్యమవ్వదని తెలిపారు. మ్యాచ్ కోసం చేసిన ఖర్చులన్నీ వృథానే కదా అని చెప్పారు. ఒక ఆటగాడికి పాజిటివ్ వస్తే మొత్తం టోర్నీ రద్దవ్వకుండా ఏం చేయాలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ద్రవిడ్ సూచించారు.

ప్రొఫెషనల్ స్థాయిల్లో క్రీడాకారులందరూ ప్రతి దానికీ అలవాటు పడాలన్నారు. ప్రదర్శనలపై ఇతర ప్రభావాలు పడనీయకుండా జాగ్రత్త పడాలన్నారు. ఒకప్పటితో పోలిస్తే అనుభవం భిన్నంగా ఉంటుందని సూచించారు. అభిమానుల ముందు ఆడేందుకు ఆటగాళ్లు ఇష్టపడతారని చెప్పారు. అదొక సంతృప్తి కలగజేస్తుందని తెలిపారు. ఇప్పుడది కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నారు. క్రీడాకారులుగా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటామని అన్నీ సవ్యంగా జరగవన్నారు. 

Read: 1999లో ఇదే రోజున 318 పరుగులతో గంగూలీ, ద్రవిడ్ రికార్డు