స్పీడ్ పోస్టులో తాళి పంపారు.. జూమ్‌లో ఇన్విటేషన్.. తల్లిదండ్రులు చూస్తుండగా పెళ్లి చేసుకున్నారు!

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 02:13 AM IST
స్పీడ్ పోస్టులో తాళి పంపారు.. జూమ్‌లో ఇన్విటేషన్.. తల్లిదండ్రులు చూస్తుండగా పెళ్లి చేసుకున్నారు!

కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నిజమే.. కరోనా వచ్చినా కూడా వీరిద్దరి కల్యాణం ఆగలేదు. కరోనా లాక్ డౌన్‌తో ఆడంబరంగా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. కొన్నాళ్లు ఆగాక పెళ్లి తంతు కానిద్దమనుకునే వాళ్లు కొందరు.. కరోనా అయినా సరే.. పెళ్లి తంతు జరిపించాల్సిందేనని కొందరు ప్రస్థుత పరిస్థితులకు తగినట్టుగా లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కేరళకు చెందిన విఘ్నేష్ కెఎమ్, అంజలి రంజిత్ అనే యువ జంట తమ పెళ్లి కోసం ఏడాదిగా ప్లాన్ చేస్తోంది. ఇంతలో కరోనా మహమ్మారి దాపరించింది. అయినాసరే.. కరోనా కాలంలో పెళ్లి చేసుకునేందుకు కేరళ జంట అన్ని ఏర్పాట్లు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ముహర్తం ప్రకారమే పెళ్లి చేసుకోవాలని యువ జంట నిర్ణయించుకుంది. 

బంధువులు రాలేరు.. కుటుంబ సభ్యులు సహా ఎక్కువ మంది గుమికూడరాదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎలా చేసుకోవాలి అనే డైలమాలో పడింది యువ జంట. ఎవరూ చేయని విధంగా చేసి చూపించింది. వధూవరుల తల్లిదండ్రులతో సహా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అతిథులతో కేరళ జంట వివాహం చేసుకుంది. వివాహాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌లో చేసుకున్నారు. తన రూమ్మేట్స్ సహాయంతో వరుడి ఫ్లాట్‌లో ఈ వేడుక జరిగింది. వారిలో ఒకరు దంపతుల కుటుంబ ప్రతినిధిగా వ్యవహరించారు. సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి తాళి (మంగళసూత్ర) కూడా తప్పనిసరి. అందుకే వధువరుల పెళ్లి కోసం వారి తల్లిదండ్రులు స్పీడ్ పోస్టులో తాళిని పంపారు. యువ జంట పెళ్లిని జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో తల్లిదండ్రులు వీక్షించారు. 

‘అదృష్టవశాత్తూ అంతా బాగానే జరిగింది. ఇంటర్నెట్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కుటుంబం, స్నేహితులను వర్చువల్ వివాహంలో చేరడానికి వీలు కల్పించింది. ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం కానీ నిజంగా ఎప్పటికీ మరపురాని క్షణం’ అని విఘ్నేష్ అన్నారు. సాంప్రదాయ తెలుపు “ముండు” (నడుము చుట్టూ ధరించే వస్త్రం)తో తెల్లటి చొక్కా ధరించిన వరుడు, నీలిరంగు అంచు, బంగారు జారీతో తెల్లని చీరలో వధువు, దండలు, పూల బొకేలతో పెళ్లిని వీడియో కాన్ఫరెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. 
In Kerala Couple's Wedding, Mangalsutra Via Speed Post, Parents On Zoom

ఈ జంట వర్చువల్ వెడ్డింగ్ కోసం ప్రత్యేక ఆహ్వాన కార్డును కూడా రూపొందించింది. తమ పెళ్లికి ఆహ్వానించేందుకు జూమ్ ఐడి పాస్‌వర్డ్‌తో అతిథులకు ఆహ్వానం పంపారు. విగ్నేష్  అంజలి, పూణేలో ఉద్యోగాలు చేస్తున్నారు. వేసవిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కేరళలోని వారి ఇళ్లకు వెళ్లాల్సి ఉంది. కాని లాక్ డౌన్ కారణంగా కాలేదు. లాక్ డౌన్ ప్రారంభ రోజులలో మే మొదటి వారంలో కనీసం ఇంటికి చేరుకోగలమని ఆశించారు. 

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తాము ఇప్పట్లో వెళ్ళలేము అని గ్రహించామన్నారు. పెళ్లిని వాయిదా వేయడానికి ఇష్టపడలేదని వధువు అంజలి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి కేరళ నుంచి లాగిన్ అయిన వారి తల్లిదండ్రులు, రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పుడు (మంగళసూత్రం)  వివాహ వస్త్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు. లాక్ డౌన్ మధ్య ఆన్‌టైమ్ డెలివరీ కోసం ఈ జంట ఇండియన్ పోస్ట్‌ ద్వారా పంపింది. 

Read: ఫేస్ మాస్కుల‌తో జర జాగ్రత్త!