కొంపముంచిన పార్టీ, మటన్ వ్యాపారి కారణంగా 22మందికి కరోనా, ఆందోళనలో కొనుగోలుదారులు

కరోనా వైరస్ మహమ్మారి చాలా డేంజర్ అని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనాతో గేమ్స్ వద్దని నెత్తీ

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 02:21 AM IST
కొంపముంచిన పార్టీ, మటన్ వ్యాపారి కారణంగా 22మందికి కరోనా, ఆందోళనలో కొనుగోలుదారులు

కరోనా వైరస్ మహమ్మారి చాలా డేంజర్ అని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనాతో గేమ్స్ వద్దని నెత్తీ

కరోనా వైరస్ మహమ్మారి చాలా డేంజర్ అని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కరోనాతో గేమ్స్ వద్దని నెత్తీ నోరు బాదుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు త్యాగాలు తప్పవని అంటే పార్టీలు, షికార్లు, వేడుకలు, ఫంక్షన్లు లాంటివి చేసుకోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని గొంతు చించుకుని మరీ చెప్పారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అధికారుల సూచనలు, హెచ్చరికలు, జాగ్రత్తలు పక్కన పెట్టేశారు. కరోనాతో గేమ్స్ ఆడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, ఎంజాయ్ మెంట్ పేరుతో చేతులారా కరోనా బారిన పడుతున్నారు. తమతో పాటు ఇతరులను కూడా రిస్క్ లో పడేస్తున్నారు. హైదరాబాద్ శివారు పహాడీషరీఫ్ లో, హర్షగూడలో అలాంటి దారుణాలే జరిగాయి. ఓ మటన్ వ్యాపారి కారణంగా 22మందికి కరోనా వచ్చింది. కిరాణ వ్యాపారి కుటుంబంలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు.

వేడుకల్లో పాల్గొన్న 22మందికి కరోనా, వీరిలో 13మంది ఒకే కుటుంబానికి చెందిన వారు:
పహాడీషరీఫ్‌లో ఓ వేడుకలో పాల్గొన్న 22 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పహాడీషరీఫ్‌లో మటన్‌ వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి కుటుంబ సభ్యులు, బంధువులు ఏటా వేసవిలో ఒకచోట చేరి సరదాగా గడిపేవారు. కరోనాను ఖాతరు చేయకుండా ఈసారీ అలాగే పది రోజుల కిందట నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుక చేసుకోవాలని నిర్ణయించారు. దానికి బంధువులతో పాటు జియాగూడ, గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున, సంతోష్‌నగర్‌ నుంచి ఐదుగురు.. మొత్తం 14 మంది హాజరయ్యారు. ఇలా మొత్తం 42 మంది ఒకేచోట చేరి రెండు రోజులపాటు పార్టీ చేసుకున్నారు. 

హర్షగూడలో కిరాణ వ్యాపారి కుటుంబానికి కరోనా:
అనంతరం వీరిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణా దుకాణం నడిపించే బంధువు ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో బోరబండ నుంచి వేడుకకు హాజరైన ముగ్గురికి, సంతోష్‌నగర్‌ నుంచి వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి నాలుగు రోజుల కిందట కరోనా నిర్ధారణ అయింది. పహాడీషరీఫ్‌లో వేడుక జరిగిన విషయం వైద్య సిబ్బందికి తెలిసింది. అందులో పాల్గొన్న పహాడీషరీఫ్‌లోని 28 మందిని మే 23 నుంచి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సోమవారం(మే 25,2020) వీరి శాంపిల్స్‌ పరీక్షించగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కిరాణా వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురికి పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వేడుకలో పాల్గొన్న మొత్తం 22 మందికి కరోనా సోకినట్లయ్యింది.

మటన్, సరుకులు కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు:
పహాడీషరీఫ్‌లో కరోనా సోకిన వ్యక్తి మటన్‌ వ్యాపారి కావడంతో అక్కడ ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ప్రాథమిక కాంటాక్టు కింద 21 మందిని, సెకండరీ కాంటాక్టు కింద 47 మందిని గుర్తించి రావిర్యాల క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఇంకా ఎంతమంది మాంసం కొన్నారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితోపాటు హర్షగూడలోని కిరాణా వ్యాపారి నుంచి ఎంతమంది సరకులు కొనుగోలు చేశారన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. హర్షగూడలో కరోనా నిర్ధారణ అయిన కుటుంబం ఉండే బస్తీలో 125 ఇళ్లను గుర్తించి కంటెయిన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. బుధవారం(మే 27,2020) నుంచి ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయనున్నట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ 40 బృందాలతో సర్వే చేపట్టనున్నారు.

తెలంగాణలో 2వేలకు చేరువలో కరోనా కేసులు:
తెలంగాణ‌లో క‌రోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు మంగళవారం(మే 26,2020) భారీగా పెరిగాయి. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 71 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 1,991కి చేరాయి. మంగ‌ళ‌వారం(మే 26,2020) రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ రోజువారీ బులిటెన్ ను విడుద‌ల చేసింది. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో మంగళవారం ఓ వ్యక్తి కరోనా వల్ల చనిపోయాడు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 57కు చేరింది. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణపేట్ జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున కొత్త కేసులు వ‌చ్చాయి. అలాగే 12 మంది వ‌ల‌స కార్మికుల‌కు, ఇటీవ‌ల విదేశాల నుంచి తిరిగొచ్చిన న‌లుగురికి పాజిటివ్ వ‌చ్చింది.

24 గంట‌ల్లో 120 మంది రిక‌వ‌రీ:
గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా క‌రోనా పేషెంట్లు రివ‌క‌రీ అయ్యారు. ఒక్క రోజులో 120 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1284కు చేరింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో 650 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కొద్ది వారాలుగా కొత్త కేసులు లేని మేడ్చ‌ల్, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణ పేట్ జిల్లాల్లో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో గ‌డిచిన 14 రోజులుగా కొత్త కేసులు న‌మోదు కాని జిల్లాల సంఖ్య 21కి త‌గ్గింది.

Read: గ్రేటర్ లో కరోనా డేంజర్ బెల్స్, 6 జోన్లలో 107 కంటైన్మెంట్ జోన్లు, 2వేలకు చేరువలో కొవిడ్ కేసులు