4 రోజుల్లో రూ.600 కోట్లు, తెలంగాణలో దిమ్మతిరిగే రేంజ్ లో మద్యం అమ్మకాలు

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 04:57 AM IST
4 రోజుల్లో రూ.600 కోట్లు, తెలంగాణలో దిమ్మతిరిగే రేంజ్ లో మద్యం అమ్మకాలు

లాక్ డౌన్ కారణంగా దాదాపు 45 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు మూతపడ్డాయి. లాక్ డౌన్ మూడో దశలో కేంద్రం పలు సడలింపులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో మే 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. మద్యం షాపులు తెరవడం మొదలు.. ఓ రేంజ్ లో అమ్మకాలు జరుగుతున్నాయి. అమ్మకాల కలెక్షన్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచి ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం(మే 9,2020) ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

గ‌త నాలుగు రోజులు అమ్మ‌కాలు ప‌రిశీలిస్తే..
* మే 6న రూ.72.5 కోట్లు
* మే 7వ తేదీన 188.2 కోట్లు
* మే 8న డిపోల నుంచి రూ. 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు
* మే 9న డిపోల నుంచి రూ.149 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు 

వీటిని లెక్క చూస్తే… మ‌ద్యం షాపులు రీఓపెన్ చేసిన 4 రోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో మద్యం రేట్లను పెంచినట్లుగానే తెలంగాణలోనూ పెంచి ఉంటే కలెక్షన్లు మరింతగా ఉండే అవకాశం ఉండేది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలను ప్రభుత్వం అంతగా పెంచకపోవడం కూడా అమ్మకాలకు ఊతం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో మద్యం ధరలను 75 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అదే తెలంగాణలో మాత్రం మద్యం ధరల పెంపు చీప్ లిక్కర్‌పై 11 శాతం.. ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచారు. మొత్తంగా లిక్కర్ సేల్స్ జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోతోంది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయంతో ఖజానా గలగలమంటోంది.

దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు మందు దొరక్క ఉక్కిరిబిక్కిరైన మద్యం ప్రియులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. మద్యం కొని మందుదాహం తీర్చుకుంటున్నారు. పీకల దాకా తాగి డ్యాన్సులు చేస్తున్నారు. కిక్కులో సేద తీరుతున్నారు. తొలి రోజే మద్యం షాపులు తెరవక ముందే మద్యం ప్రియులు అక్కడికి చేరుకున్నారు. వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. కాగా కరోనా తీవ్రత తగ్గని నేపథ్యంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దీని కారణంగా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.