ఏపీలో కొవిడ్ సూప‌ర్ స్ప్రెడ‌ర్స్.. ఆ 40 మంది 300 మందికి కరోనా అంటించారు

కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 05:21 AM IST
ఏపీలో కొవిడ్ సూప‌ర్ స్ప్రెడ‌ర్స్.. ఆ 40 మంది 300 మందికి కరోనా అంటించారు

కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. లాక్ డౌన్ అమలు చేస్తున్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా… కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో అతి తక్కువ కేసులు నమోదైనప్పటికీ.. ఆ తర్వాతి రోజుల్లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మహమ్మారి వైరస్ కు వ్యాపకం మనిషి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని మనిషి కావాలని చేయడం లేదు. వైరస్ బారిన పడిన సదరు వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించక పోవడంతో అతడు యధేచ్ఛగా ఎప్పటిలాగే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అలా ఆ వ్యక్తి ద్వారా కొంతమందికి ఆ కొంతమంది ద్వారా ఎంతో మందికి కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఏపీలో 40మంది కరోనా సూపర్ స్ప్రెడర్స్:
కొంతమంది నిర్లక్ష్యమే ఎంతోమందికి కరోనా వైరస్ రావడానికి కారణం అన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కార‌ణ‌మైన మూలాల‌ను గుర్తించే క్ర‌మంలో అధికారులు 40 మంది వ్యక్తులను గుర్తించారు. వారి నుంచే వైర‌స్ వ్యాప్తి ఎక్కువగా జరిగినట్టు తేల్చారు. ఆ 40మందిని సూపర్ స్ప్రెడర్ గా(Super Spreader) అధికారులు పేర్కొన్నారు. ఈ 40మంది ద్వారా సుమారు 300 మందికి పైగా వైరస్ బారిన పడ్డారని అధికారులు గుర్తించారు. ఇక ఈ 40 మంది నుంచి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్ వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు, కృష్ణ, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

* కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్‌ సోకగా.. ఒకరి నుంచి ఇంత మందికి వైరస్‌ సోకడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే ప్రథమం.
* కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది. 
* గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్‌ సోకింది. ఈ జిల్లాలోనే ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్‌ బారిన పడేందుకు కారణమయ్యారు.
* అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్‌ సోకింది.
* ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 10 మందికి వైరస్‌ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. 

80శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు:
కాగా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో 80 శాతం మందిలో వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువ‌లో ఉంది. వైర‌స్ బారిన ప‌డి ఇప్ప‌టికే 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,980కి చేరింది.

అహ్మదాబాద్ లో 334 మంది సూపర్ స్ప్రెడర్స్:
ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేటలో ఒకే ఒక్క మహిళ కారణంగా సుమారు 40 మందికి కరోనా వైరస్ వ్యాపించింది. మార్కెట్‌లో చేపలు విక్రయించే ఈ మహిళకు ఖాళీ సమయాల్లో పలువురి దగ్గరికి వెళ్లి పలకరించడం, అష్టాచెమ్మా ఆడటం లాంటి అలవాట్లు ఉన్నాయి. ఇవి వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. విజయవాడలో ఓ లారీ డ్రైవర్ కుటుంబం పేకాట, హౌసీ ఆట కారణంగా 80 మందికి పైగా కరోనా సోకింది. దక్షిణ కొరియాలో ఒకే ఒక్క మహిళ కారణంగా సుమారు 1200 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. ఇలాంటి వాళ్లను సూపర్ స్ప్రెడర్ అంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇలాంటి సూపర్ స్ప్రెడర్లను 334 మందిని అధికారులు గుర్తించారు. వీరి ద్వారా ఇప్పుడు ఎంత మందికి వైరస్ వ్యాపించిందనేది హాట్ టాపిక్‌గా మారింది.

Read More:

ఏపీలో 2వేలకు చేరువలో కరోనా కేసులు, కొత్తగా 50 మందికి కొవిడ్

* కొవిడ్ కల్లోలం, దేశంలో మే నెలాఖరుకి 2లక్షల కరోనా కేసులు