Students Survey: కరోనా తర్వాత కష్టంగా క్లాసులు.. పాఠాలు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉంది

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పనులకు వెళ్లే పెద్దవారి వరకు... కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు.

Students Survey: కరోనా తర్వాత కష్టంగా క్లాసులు.. పాఠాలు అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉంది

School

Survey on Students: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పనులకు వెళ్లే పెద్దవారి వరకు… కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా విద్యార్థుల చదువులు రెండేళ్లపాటు అటకెక్కాయి.

దీంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాఠశాలలు పాక్షికంగానే తెరుచుకోవడంతో, విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యారు.

ఆన్‌లైన్ క్లాసుల సమయంలో పాఠాలను అర్ధం చేసుకోవడంలో విద్యార్థులకు చాలా కష్టతరమైంది. ఆన్‌లైన్ తరగతులకు హాజరైన దాదాపు 45శాతం మంది విద్యార్థులు.. ఆన్‌లైన్ విధానంలో పాఠాలు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్(NISA) సంస్థ ఇటీవల విద్యార్ధులపై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ (NISA) మరియు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRSMA) సంస్థల ప్రకటనలో ఎన్ఐఎస్ఏ వెల్లడించిన వివరాలు మేరకు.. ఆన్‌లైన్ తరగతులు వినే 45 శాతం మంది విద్యార్థులు.. పాఠాలు అర్థంకాక, సబ్జెక్టుల వారీగా ప్రత్యక్షంగా ట్యూషన్ క్లాసులకు వెళ్లినట్లు చెప్పారు.

ఇక పాఠాలు అర్ధంకాకపోయినా ఎక్కడికీ పోలేకపోయినట్లు 42.3శాతం మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇది విద్యార్థుల్లో మరింత ఒత్తిడి, టెన్షన్, ఆందోళనకు కారణమైంది.

ఇక తరగతుల వారీగా, సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరో సర్వే జరిపారు. సబ్జెక్టుల్లో మ్యాథ్స్ క్లాస్ ఎంతో కఠినంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు.

ఆన్‌లైన్ ద్వారా మ్యాథ్స్ తరగతులు వింటుంటే ఏమి అర్ధం కావట్లేదని, అందువల్ల తాము రెండు మూడు క్లాసులు వెనుకబడి ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

మూడు, ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థులు ఇంగ్లీష్ క్లాసులు అర్ధం కావడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 1500 మందికి పైగా విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.