ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 10లక్షల మంది కోలుకున్నారు

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 04:46 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 10లక్షల మంది కోలుకున్నారు

కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగుచూసింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 10లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి 10లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వార్త ప్రజలకు, ప్రభుత్వాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కరోనా సోకితే చావు తప్పదన్న భయాలు ఉన్న వేళ ఈ వార్త వారిలో ధైర్యం నింపింది. అమెరికాలో లక్షా 54వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా మహమ్మారిపై పోరులో కీలక మైలురాయి:
10లక్షల మంది కోలుకోవడం, మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిపై పోరులో కీలక మైలురాయిగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వైరస్ బారిన పడ్డవారి సంఖ్యలో ఇది దాదాపుగా మూడో వంతు కావడం విశేషం. భౌతిక దూరం వంటి ప్రమాణాలను పక్కాగా అమలు చేస్తున్న పలు దేశాల్లో పూర్తిగా ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి. వాటిలో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. 

సోషల్ డిస్టేన్స్ అవసరం లేదన్న ట్రంప్:
కాగా, భౌతిక దూరాన్ని పాటించాలన్న మార్గదర్శకాలను తమ ప్రభుత్వం పొడిగించబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. లాక్ డౌన్  కారణంగా దాదాపు నెల రోజులుగా వైట్ హౌస్ కే పరిమితమైన ట్రంప్.. రాష్ట్రాల పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో తాజాగా 24 గంటల వ్యవధిలో 2,502 మంది ప్రాణాలను బలి తీసుకుంది. న్యూయార్క్ నగర సమీపంలోని బ్రూక్లిన్ లో అంత్యక్రియలు నిర్వహించే ఓ కేంద్రం బయట నిలిపి ఉంచిన రెండు ట్రక్కులు, ఓ వ్యానులో 50కి పైగా మృతదేహాలు కనిపించాయి. రిఫ్రిజిరేషన్ సదుపాయం లేకపోవడంతో అవన్నీ కుళ్లిపోయాయి. అవి కరోనా దెబ్బకు మృతిచెందినవారివేనా? లేదా? అనేది స్పష్టంగా తెలియరాలేదు. (కరోనా వైరస్ ఇప్పట్లో పోదు.. మరో రెండేళ్లు మనతోనే ఉంటుంది)

లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై ఆందోళనలు:
యూరప్ లోని పలు దేశాలు జన సంచారంపై నిషేధాజ్ఞలను సడలిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ లలో కరోనా కేసులు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నాయని గుర్తుచేసింది. బెలారస్, రష్యా, కజఖిస్థాన్, ఉక్రెయిన్ లలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలను ఎత్తివేయడం కరెక్ట్ కాదంది.

ప్రపంచవ్యాప్తంగా 34లక్షల కరోనా కేసులు, 2లక్షల 39వేల మరణాలు:
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంటికి కనిపించని శత్రువు లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఈ వైరస్‌ దాడితో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2లక్షల 39వేల 586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 34లక్షలకు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి కోలుకుని 10లక్షల 80వేల మందికి పైగా డిశ్చార్జి అయ్యారు.

అమెరికాలో 65,766 మంది, స్పెయిన్‌లో 24,824, ఇటలీలో 28,236, యూకేలో 27,510, ఫ్రాన్స్‌లో 24,594, జర్మనీలో 6,736, టర్కీలో 3,258, రష్యాలో 1,169, ఇరాన్‌లో 6,091, బ్రెజిల్‌లో 6,410, చైనాలో 4,633, కెనడాలో 3,391, బెల్జియంలో 7,703, నెదర్లాండ్స్‌లో 4,893, ఇండియాలో 1,225, స్విట్జర్లాండ్‌లో 1,754 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

* ప్రపంచవ్యాప్తంగా 34లక్షలకు పైగా కరోనా కేసులు, 2.39లక్షల మరణాలు
* అమెరికాలో 11లక్షల 31వేల కరోనా కేసులు, 65వేల 759 మరణాలు
* అమెరికాలో నిన్న(మే 1,2020) ఒక్క రోజే 1897 మంది మృతి
* దేశవ్యాప్తంగా 37వేల 260 కరోనా కేసులు, 1225 మరణాలు
* దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9వేల 659 కోలుకున్నారు
* తెలంగాణలో 1044 కరోనా కేసులు, 28 మరణాలు
* ఏపీలో 1463 కరోనా కసులు, 33 మరణాలు
* ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 403, 1027 యాక్టివ్ కేసులు
* మహారాష్ట్రలో 11వేల 506 కరోనా కేసులు, 458 మరణాలు, 1879 కోలుకున్నారు